EU: అత్యాచార నిందితుడి ఆధీనంలోనే 13 ఏళ్ల బాలిక .. పాక్‌పై ఈయూ మండిపాటు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల అపహరణలు, బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాల ఘటనలు ఆందోళనకరంగా మారాయని యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై గురువారం (జూలై 9) తీర్మానం ఆమోదించిన యూరోపియన్ పార్లమెంట్.. బాలికల రక్షణకు పాకిస్థాన్ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మైనారిటీలకు చెందిన చిన్నారుల భద్రత కోసం న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ఇస్లామాబాద్‌ను కోరింది.
వివరాలు
మారియా షాబాజ్ కేసుతో పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడి
ఈ తీర్మానానికి ప్రధాన కారణంగా 13 ఏళ్ల క్రైస్తవ బాలిక మారియా షాబాజ్ కేసు నిలిచింది. 2025 జూలైలో ఆమెను ఇంటి నుంచి అపహరించిన దుండగులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, 30 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల రికార్డులు, జనన ధ్రువపత్రాల ప్రకారం ఆమె మైనర్ అయినప్పటికీ, ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్ ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టు ఆ వివాహాన్ని చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించింది. ప్రస్తుతం మారియా తనను అపహరించిన వ్యక్తి వద్దే ఉండగా, ఆమె తల్లిదండ్రులు చివరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు మారియాకు స్వతంత్ర న్యాయ సహాయం, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం, మానసిక ఆరోగ్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
వివరాలు
హిందూ, క్రైస్తవ బాలికలే ఎక్కువగా బాధితులు
ఆమె కేసు ఒక్కటే కాకుండా, పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇది ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. 2025 ఐక్యరాజ్య సమితి గణాంకాలను ప్రస్తావించిన యూరోపియన్ పార్లమెంట్.. బలవంతపు మత మార్పిడులకు గురయ్యే మహిళలు, బాలికల్లో సుమారు 75 శాతం మంది హిందువులు, మిగిలిన 25 శాతం మంది క్రైస్తవులేనని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అపహరణ కేసులను నమోదు చేసి పర్యవేక్షించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్‌ను కోరింది. స్థానిక పోలీసులు ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వివాహాలకు పాల్పడిన వారిపై కఠినంగా కేసులు నమోదు చేసి శిక్షించేలా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది.
వివరాలు
మారియా కేసును నెలలుగా ప్రస్తావిస్తూ వస్తున్న హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్థాన్
అలాగే అపహరణకు గురైన బాలికలు సురక్షితంగా తమ కుటుంబాలకు తిరిగి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్థాన్ (HRFP) వంటి మానవ హక్కుల సంస్థలు మారియా కేసును నెలలుగా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని, దేశంలో తరచుగా కనిపిస్తున్న ఒక ప్రమాదకర ధోరణి అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అపహరణకు పాల్పడిన వారు బాలికలు తమ ఇష్టంతోనే మతం మారారని చెప్పే తప్పుడు వాంగ్మూలాలను స్థానిక కోర్టులు అనేక సందర్భాల్లో అంగీకరిస్తున్నాయని కూడా ఆరోపించాయి.