Loading...
Europe Heatwave: ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హీట్‌వేవ్‌.. జూన్‌లో 12 వేల మందికి పైగా మృతి
ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హీట్‌వేవ్‌.. జూన్‌లో 12 వేల మందికి పైగా మృతి

Europe Heatwave: ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హీట్‌వేవ్‌.. జూన్‌లో 12 వేల మందికి పైగా మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపా ఖండాన్ని తీవ్ర హీట్‌వేవ్‌ అతలాకుతలం చేస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో అక్కడి పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే ఎండలు, వడగాలుల కారణంగా జూన్‌ నెలలోనే 12 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), స్విట్జర్లాండ్‌లో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వివరాలు 

ఇంగ్లాండ్‌, వేల్స్‌లో మరో 2,200 మంది మృతి 

జూన్‌ 22 నుంచి 28 వరకు కేవలం బెల్జియం,ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనే 10వేలకుపైగా మరణాలు నమోదైనట్లు సమాచారం.

అలాగే జూన్‌ 18 నుంచి 28 మధ్య ఇంగ్లాండ్‌, వేల్స్‌లో మరో 2,200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు గతంలో ఒక తరం కాలంలో ఒక్కసారి మాత్రమే కనిపించేవని, కానీ ఇప్పుడు భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావంతో దాదాపు ప్రతి ఏడాది పునరావృతమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహారా ఎడారి ప్రాంతం నుంచి ఉత్తర దిశగా వేడి గాలులు భారీగా ప్రవహించడం వల్ల ఐరోపా దేశాల్లో 'హీట్‌డోమ్‌' పరిస్థితులు ఏర్పడి ఈ తీవ్ర ఉష్ణోగ్రతలకు కారణమయ్యాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT