Europe: 2100 నాటికి యూరప్‌లో 12.7 కోట్ల మంది పేదరికంలోకి.. అధ్యయనం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్ ప్రస్తుతం తీవ్ర వేడి గాలుల బారిన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఫ్రాన్స్‌లో 1947లో వాతావరణ రికార్డులు ప్రారంభమైన తర్వాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో రెడ్ హీట్ అలర్ట్ ప్రకటించారు. స్పెయిన్‌లో 1950 తర్వాత అత్యధిక సగటు రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ జూన్ నెలలోనే రికార్డు స్థాయి వేడి నమోదవుతోంది. పశ్చిమ, మధ్య యూరప్‌ను వణికిస్తున్న ఈ చారిత్రక వేడి గాలులకు "ఒమేగా బ్లాక్" అనే వాతావరణ పరిస్థితి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో భారీ స్థాయిలో వేడి గాలి ఒకే ప్రాంతంలో చిక్కుకుపోవడంతో అక్కడ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి.
వివరాలు
కుటుంబాల సగటు ఆదాయం దాదాపు 3శాతం
తీవ్ర వేడి,కరువు కలిసి వస్తే వాటి ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వాతావరణ పరిశోధనా సంస్థ క్లైమేట్ అనలిటిక్స్ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం,వేడి గాలులు,కరువు కలిసి వచ్చినప్పుడు యూరప్‌లో కుటుంబాల సగటు ఆదాయం దాదాపు 3శాతం వరకు తగ్గుతోంది. ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఈ నష్టం మరింత అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆదాయ అసమానతలు మరింత పెరిగి,లక్షలాది మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన ప్రధానంగా యూరప్‌ను కేంద్రంగా చేసుకున్నప్పటికీ,ప్రపంచంలోని ఇతర దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇలాంటి ప్రభావమే కనిపించే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
2100 నాటికి ఆదాయాలకు భారీ దెబ్బ
ఈ అధ్యయనం ACCREU ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడగా, గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 2.7 డిగ్రీల సెల్సియస్ పెరిగితే,యూరప్‌లో కుటుంబాల సగటు ఆదాయం 27 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. అదే పారిస్ ఒప్పందం లక్ష్యమైన 1.5 డిగ్రీల సెల్సియస్‌కే ఉష్ణోగ్రతల పెరుగుదలను పరిమితం చేయగలిగితే ఆదాయ నష్టం 7 శాతానికి మాత్రమే పరిమితం అవుతుందని వెల్లడించింది. 2.7 డిగ్రీల వేడిమి పెరిగే పరిస్థితిలో యూరప్‌లో దాదాపు 12.7 కోట్ల మంది పేదరిక ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే 1.5 డిగ్రీల లక్ష్యం సాధిస్తే ఈ సంఖ్య 6 కోట్లకు తగ్గే అవకాశముందని పరిశోధకులు అంచనా వేశారు.
వివరాలు
వేడి, కరువు కలిసి వస్తే నష్టం మరింత తీవ్రం
ఈ అధ్యయన ప్రధాన రచయిత జెస్సీ ష్లైపెన్ మాట్లాడుతూ తీవ్ర వేడి ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, పని చేసే సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందన్నారు. దీనికి కరువు కూడా తోడైతే ఆర్థిక నష్టం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పరిస్థితులు మరింత తరచుగా ఏర్పడి, కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతాయని వివరించారు.
వివరాలు
వేడి గాలులు, కరువు వల్ల కుటుంబాల ఆదాయం తగ్గుదల
2004 నుంచి 2022 వరకు సేకరించిన గణాంకాలను విశ్లేషించిన ఈ అధ్యయనం ప్రకారం,వేడి గాలులు లేదా కరువు విడివిడిగా సంభవించినప్పుడు కంటే రెండూ ఒకేసారి వచ్చినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వేడి గాలుల వల్ల కుటుంబాల ఆదాయం 0.7 శాతం,కరువు వల్ల 1.8శాతం తగ్గుతుంది. అయితే రెండూ కలిసి సంభవిస్తే, ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రాంతాల్లో,కుటుంబాల ఆదాయం దాదాపు 3 శాతం వరకు పడిపోతుందని అధ్యయనం పేర్కొంది. తీవ్ర వేడి కారణంగా కార్మికుల ఆరోగ్యం దెబ్బతిని పనితీరు తగ్గుతుంది. వ్యవసాయ పంటల దిగుబడి తగ్గడంతో ఆహార ఉత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. అలాగే నీటిపై ఆధారపడిన రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
పేదలపై అత్యధిక ప్రభావం
ఈ పరిస్థితుల వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతల ప్రభావం అత్యంత పేద వర్గాలపై ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. జనాభాలో అత్యంత పేద 20 శాతం మందికి చెందిన కుటుంబాల ఆదాయం మిగిలిన వారితో పోలిస్తే మరో 2 శాతం అదనంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ఉన్న ఆదాయ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీల సెల్సియస్ పెరిగితే గ్రీస్, స్పెయిన్, రొమేనియా, బల్గేరియా, సైప్రస్ దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యే అవకాశముందని అధ్యయనం వెల్లడించింది.