
Zelensky: ట్రంప్‌తో సమావేశానికి జెలెన్‌స్కీకి తోడుగా యూరోపియన్ నాయకులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కావడంపై ఐరోపా దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలిసేందుకు అమెరికాకు వెళ్లినప్పుడు,వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీకి తీవ్ర అసౌకర్యం కలిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ట్రంప్ ఆయనను కఠినంగా ప్రశ్నిస్తూ, మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని,ఈసారి జెలెన్‌స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా మరికొంతమంది ఐరోపా నేతలు కూడా అమెరికాకు వెళ్లాలని నిర్ణయించారు. వీరంతా సోమవారం జరగబోయే జెలెన్‌స్కీ-ట్రంప్ భేటీకి హాజరవుతున్నారు.
వివరాలు
చర్చనీయాంశమవుతున్న పుతిన్ చేసిన డిమాండ్
ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా అలాస్కాలో ట్రంప్-పుతిన్‌ల మధ్య రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఆ భేటీ సమయంలో ట్రంప్ చూపిన సడలింపు ధోరణి ఐరోపా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా దొనెట్స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవాలని పుతిన్ చేసిన డిమాండ్ పెద్ద చర్చనీయాంశమైంది. అందుకే సోమవారం జరిగే సమావేశంలో పుతిన్ సూచనలను తీసుకుని, ట్రంప్ జెలెన్‌స్కీపై ఒత్తిడి తీసుకురావచ్చన్న భయం యూరప్ నేతల్లో పెరిగింది. ఈ కారణంగానే జెలెన్‌స్కీని ఒంటరిగా పంపకుండా, తాము కూడా ఆయనతో పాటు వెళ్ళాలని వారు తుది నిర్ణయానికి వచ్చారు.