Statue of Union: టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది
అమెరికాలోని టెక్సాస్‌లోని 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం కొలువుదీరింది. ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని షుగర్ ల్యాండ్‌లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 18వరకు నిర్వహించిన మహాప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ఈ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు నిర్వాహకులు తెలిపారు. వారి ప్రకారం,ఈ విగ్రహం నిస్వార్థత, భక్తి , ఐక్యతకు చిహ్నం.దీనికి 'స్టాట్యూ ఆఫ్ యూనియన్'(Statue of Union) అని పేరు పెట్టారు. పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత, ప్రఖ్యాత వేద పండితుడు శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా హనుమంతుడి విగ్రహాన్నిప్రతిష్ఠించారు. చిన జీయర్ స్వామీజీ నేతృత్వంలో వేద అర్చకులు, పండితుల పర్యవేక్షణలో మూడు రోజులపాటు జరిగిన ప్రాణ ప్రతిష్ఠా క్రతువులు భక్తి, ఆధ్యాత్మికతను చాటాయి.
అమెరికా సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో కొత్త మైలురాయి
ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో పైనుంచి భక్తులపై పూలు, పవిత్ర జలాన్ని చల్లారు. అలాగే 72 అడుగుల దండను విగ్రహం మెడలో వేశారు. వేలాది మంది భక్తులు ఏకకాలంలో శ్రీరాముడుఎం , హనుమంతుని నామాలను జపించారు. ఈ విగ్రహం హనుమంతుని అచంచలమైన స్ఫూర్తికి ప్రతీకగా ఉండటమే కాకుండా.. అమెరికా సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో కొత్త మైలురాయిని కూడా సూచిస్తుందని నిర్వాహకులు తెలిపారు.