Page Loader
పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!
పాక్ ఆర్మీ హనీట్రాప్‌

పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!

వ్రాసిన వారు Stalin
Jan 03, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్‌కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్‌లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం. రిటైర్డ్ మిలటరీ అధికారి మేజర్ ఆదిల్ రాజా 'సోల్జర్ స్పీక్స్' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. ఆయనకు దాదాపు 3 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తాజా వ్లాగ్‌లో ఆయన హనీ ట్రాప్‌గురించి చెప్పడంతో పాటు దీని వెనక జనరల్(రిటైర్డ్) బజ్వా, ఐఎస్ఐ మాజీచీఫ్ ఫైజ్ హమీద్‌ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అది కాస్త వైరల్‌గా మారింది.

పాకిస్థాన్

స్పందించిన హీరోయిన్ సాజల్ అలీ

ఆదిల్ రాజా తన వ్లాగ్‌లో ఆర్మీ అధికారులకు సహకరించే హీరోయిన్లు, మోడల్స్ పేర్లను నేరుగా చెప్పకుండా వారి మొదటి అక్షరాలను చెప్పారు. 'MH,MK,KK,SA' అక్షరాలతో వచ్చే హీరోయిన్లు, మోడల్స్‌తో.. హనీట్రాప్‌కు పాక్ ఆర్మీ పాల్పడుతోందని ఆదిల్ రాజా చెప్పారు. ఆ అక్షరాలను చూసిన అందరూ.. మెహ్విష్ హయత్, మహిరా ఖాన్, కుబ్రా ఖాన్, స్టార్ హీరోయిన్ సాజల్ అలీగా అందరూ ఊహించుకున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై హీరోయిన్ సాజల్ అలీ స్పందిచారు. రాజా వీడియో గురించి నేరుగా ప్రస్తావించకుండా ఆరోపణలను తిప్పికొట్టారు. 'మనదేశం నైతికంగా అధోగతి పాలవుతుండటం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నన్ను దిగజార్చడానికి ఇదొక కొత్తనాటకం' అని ఆదిల్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.