F-1 visa reforms: ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు చేయనున్న అమెరికా.. ఇది భారతీయ విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తుందంటే
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో చదువుకునే, అక్కడ ఉద్యోగాల కోసం కృషి చేసే ఎంతోమంది భారతీయుల డాలర్ కలలు ఇటీవలి కాలంలో ఆవిరైపోతున్నాయనే ఆందోళన పెరిగింది. ఎన్నో ప్రణాళికల్ని వేసుకుని, అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారి ఆశలు,ఆశయాలన్నీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వీసాల కఠిన నిబంధనలతో ఆడియాశలుగా మారుతున్నాయి కానీ ఇదే సమయంలో భారతీయులకు మాత్రం ఒక శుభవార్త ఎదురుకానుందనే సమాచారం బయటకు వచ్చింది. ఏమిటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్దాం..
వివరాలు
ప్రారంభమైన 'ఇంటెంట్ టు లీవ్' రద్దు చేసే ప్రక్రియ
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు త్వరలోనే పెద్ద ఉపశమనాన్ని ప్రభుత్వం ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోతామని సాక్ష్యాలు చూపాల్సిన అవసరం ఉండేది. దీనిని 'ఇంటెంట్ టు లీవ్' అనే నిబంధనగా పిలుస్తారు. ఈ షరతును పూర్తిగా రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ నియమాన్ని ఎత్తి వేయడానికి డిగ్నిటీ యాక్ట్-25 పేరుతో ఒక ప్రతిపాదనను చట్టసభ సభ్యులు ముందుకు తీసుకురావడంతో, ఇది త్వరలోనే ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ బిల్లు కాంగ్రెస్ రెండు సభలలో పాస్ కావాలి; అనంతరం ట్రంప్ సంతకం చేస్తే నిబంధన అధికారికంగా రద్దుకానుంది.
వివరాలు
ఇంటెంట్ టు లీవ్ రూల్ ఏమిటి?
ప్రస్తుతం అనేక ఎఫ్-1 వీసా దరఖాస్తులు ఈ 'ఇంటెంట్ టు లీవ్' నిబంధన ఆధారంగానే తిరస్కరించబడుతున్నాయి. అమెరికా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసే వారు తమ చదువు ముగిసిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్తామని ఇంటర్వ్యూలో నిర్ధారించాలి. ఇందుకు స్వదేశంలో ఉన్న కుటుంబ ఆస్తులు, ఉద్యోగ అవకాశాలు లేదా ఇతర బలమైన బంధాలను రుజువు చేయాల్సి వస్తుంది. ఇది చాలా మంది విద్యార్థులకు పెద్ద అడ్డంకిగా మారింది.
వివరాలు
విదేశీ విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం
ప్రత్యేకంగా భారతీయులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది భారత విద్యార్థులకు జారీ అయ్యే ఎఫ్-1 వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయేందుకు కూడా ఇదే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఎక్కువ శాతం తిరస్కరణలు 'ఇంటెంట్ టు లీవ్'ను రుజువు చేయలేకపోయిన అభ్యర్థులవే అని వెల్లడించారు. ఇప్పుడు ఈ నియమం రద్దయితే, అమెరికాకు వెళ్లేందుకు ఉత్సాహం చూపే విదేశీ విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.