LOADING...
Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్
'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్

Israel vs Iran : 'ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు'.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తోసిపుచ్చిన ఇజ్రాయెల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నాయకులను హత్య చేయాలనే ప్రణాళికను ఇజ్రాయెల్ రూపొందించిందంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాటు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం హత్యాయత్నానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది.

వివరాలు

ఆ ఆరోపణలు తిరస్కరించిన ఇజ్రాయెల్..

అంతేకాకుండా, ఈ ప్రణాళిక గురించి ముందుగానే తెలుసుకున్న అమెరికా సంబంధిత సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేసిందని కూడా ఆ పత్రిక వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ పూర్తిగా తిరస్కరించింది. ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఇజ్రాయెల్, 'ఇజ్రాయెల్-ఇరాన్ చర్చల ప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. అందులోని అంశాలకు వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదు' అని పేర్కొంది.

వివరాలు

ఆ ఆరోపణలను కొట్టిపారేసిన ఇజ్రాయెల్..

ఇక ఏప్రిల్‌లో ప్రారంభమైన శాంతి చర్చల సమయంలో ఇరాన్ ప్రముఖులపై దాడి జరిగితే చర్చల ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కథనం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య వచ్చిన వార్తపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందిస్తూ అందులోని ఆరోపణలను నిరాధారమని కొట్టిపారేసింది.

Advertisement