Israel-Palestine: సాగునీరు లేక రైతుల కన్నీళ్లు.. ఊట నీటితో సెటిలర్ల 'జల్సా'
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పటివరకు భూమి, సరిహద్దుల అంశాల చుట్టూనే ప్రధానంగా సాగింది. అయితే ఇప్పుడు నీటి వనరులపై నియంత్రణ కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి కారణమవుతోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇజ్రాయెలీ సెటిలర్లు మాత్రం తమ చర్యలకు భిన్నమైన కారణాలను చెబుతున్నారు.
వివరాలు
ఫసాయిల్ గ్రామంలో నీటి వివాదం
జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
ఆ నీటితో సమీపంలోని పురాతన కొలనును నింపి.. అందులో ఈత కొడుతూ వినోదం పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు సెటిలర్లు ఊట నీటిని ట్యాంకర్లలో నింపుకుని.. దారిలోనే నీటిని పారబోస్తున్నారని, కొంత నీటిని నిర్జన ప్రాంతాల్లో వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో అక్కడి పాలస్తీనా రైతుల్లో ఆందోళన పెరిగింది. గతంలో ఈ ఊట నీటితో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు తదితర పంటలను సాగు చేసేవారమని ఫసాయిల్ రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం నీరు అందక పొలాలు ఎండిపోయాయని, కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిందని వాపోతున్నారు.
వివరాలు
ఊటను కొలనుగా మార్చి.. పర్యాటక ప్రాంతంగా?
సాగునీటి పైపులను కూడా స్వాధీనం చేసుకున్నారని, ఊట ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. సహజ ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అయితే కొందరు ఇజ్రాయెలీ సెటిలర్లు దీనిపై భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని పేర్కొంటున్నారు.
అయితే పురావస్తు నిపుణులు మాత్రం ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని చెబుతున్నారు.
చరిత్ర, పురావస్తు అంశాలను ఆధారంగా చేసుకుని వెస్ట్ బ్యాంక్‌పై ఆధిపత్య భావనను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
'ఇది నీటి యుద్ధం'
పాలస్తీనా అధికారులు నీటి వనరులపై నియంత్రణను తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. నీటి సరఫరాను అడ్డుకోవడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇది శబ్దం లేని బుల్లెట్‌లాంటి నీటి యుద్ధమని పాలస్తీనా వాటర్ అథారిటీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్‌లోని పలు నీరు, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు నమోదయ్యాయి.
ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరుల నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో సమస్య తాగునీటి వనరులకూ విస్తరించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడి
నీటి కొరతతో పాటు సెటిలర్ల నుంచి దాడులు, బెదిరింపులు కూడా పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఇజ్రాయెలీ సెటిలర్లు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆయా ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.
పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే తాము చర్యలు చేపడుతున్నామని సమర్థించుకుంటున్నారు.
వివరాలు
భూమి తర్వాత నీరు.. మున్ముందు మరింత ఉద్రిక్తత?
వెస్ట్ బ్యాంక్‌లో భూమి వివాదం తర్వాత నీటి వనరులు మరో ప్రధాన ఘర్షణ అంశంగా మారుతున్నాయి.
వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి కీలకమైన సహజ వనరులపై నియంత్రణ కోసం ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న పోరు భవిష్యత్‌లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.