South Korea plane crash: ముయాన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి యాంత్రిక వైఫల్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బ్యాంకాక్ నుండి బయల్దేరిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ముయాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. దీంతో రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది.
అధికారులు ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించినా, ల్యాండింగ్ గేర్ సమస్యతో అది నిశ్చితంగా నడవలేకపోయింది.
విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయకపోవడంతో మంటలు వ్యాపించాయని ప్రతక్ష సాక్షులు పేర్కొన్నారు.
Details
విమానంలో 181 మంది
కొన్ని సందర్భాల్లో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు రావడాన్ని కూడా స్థానిక టెలివిజన్ ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీంతో పక్షి ఢీకొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రమాదంలో 175 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కలిపి 181 మంది విమానంలో ఉన్నారు. 179 మంది మరణించినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
విమానం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. ఆయన తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లకు, పోలీసులు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు ఇచ్చారు. దీంతో ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు.