USA: జాన్ ఎఫ్ కెన్నడీ మర్డర్ సీక్రెట్స్.. 2,400 ఫైల్స్‌ను గుర్తించిన ఎఫ్‌బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.
కేసుకు సంబంధించి సమీక్షించి విడుదల చేయాల్సిన ఫైల్స్ కమిటీ దృష్టికి రాకుండా దాచి ఉంచిన 2,400 ఫైల్స్‌ను ఎఫ్‌బీఐ గుర్తించింది.
ఈ రికార్డుల్లో మొత్తం 14,000 పేజీల సమాచారం ఉందని వెల్లడైంది.
ఇది అత్యంత ముఖ్యమైన విషయమని 'ది మారీ ఫెర్రల్ ఫౌండేషన్' వైస్ ప్రెసిడెంట్ జెఫర్సన్ మోర్లె పేర్కొన్నారు.
ఈ సంస్థ వద్ద జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన అత్యధిక ఆన్‌లైన్ రికార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.
వివరాలు
హత్యపై ఎన్నేళ్లుగానో నిగూఢత
సరిగ్గా 61 ఏళ్ల క్రితం, అమెరికా అధ్యక్షుడు కెన్నడీ డల్లాస్‌లో హత్యకు గురయ్యారు.
ఈ ఘటన అనంతరం జరిగిన దర్యాప్తుకు సంబంధించిన అనేక అంశాలను అమెరికా ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది.
దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని అధికారులు చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారు.
దీంతో, ఈ హత్యకు సంబంధించి అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, 'డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్' ఈ హత్య కేసుకు సంబంధించిన రహస్య ఫైల్స్‌ను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
వివరాలు
కొత్త ఆధారాలు బయటకు వస్తున్నాయా?
ఇంతలోనే, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కొత్త పత్రాలు ఉన్నట్లు శ్వేతసౌధానికి సమాచారం అందింది.
కెన్నడీ హంతకుడు ఒక్కడేనని దర్యాప్తు నివేదికలు చెబుతున్నప్పటికీ, దీని వెనుక రాజకీయ కుట్ర కోణాలున్నాయనే ఆరోపణలు ముందుకొస్తున్నాయి.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, ట్రంప్ "జాన్ ఎఫ్. కెన్నడీ హత్య కేసుకు సంబంధించిన రహస్య ఫైల్స్‌ను పూర్తిగా బహిర్గతం చేస్తాను" అని వాగ్దానం చేశారు.
ఈ ప్రకటనతో జేకేఎఫ్ వారసుడు రాబర్ట్ కెన్నడీ కూడా ట్రంప్‌కు మద్దతు తెలిపారు.
అధికారంలోకి రాగానే, జనవరి 23న కెన్నడీ హత్య కేసు ఫైల్స్‌ను బహిరంగంగా విడుదల చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
కెన్నడీ హత్య - ఒక చారిత్రక ఘటన
1961లో,అమెరికా 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్.కెన్నడీ పదవీ బాధ్యతలు చేపట్టారు.
కేవలం 43ఏళ్ల వయసులో అధ్యక్ష పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.
1963 నవంబరు 22న,టెక్సాస్ పర్యటనలో భాగంగా డల్లాస్‌లో కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఆయనపై దుండగుడు వెనక నుంచి కాల్పులు జరిపాడు.
తీవ్రంగా గాయపడిన కెన్నడీ అక్కడికక్కడే మరణించారు.ఈ హత్య కేసులో తొలుత"లీ హార్వే ఓస్వాల్డ్" అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కానీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే అతను హత్యకు గురయ్యాడు.
హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష విధించగా,కొంత కాలానికే అతను క్యాన్సర్‌తో మరణించాడు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ అనేక అనుమానాలు,రహస్యాలు శేషంగా ఉన్నాయి.ఇప్పుడిక,ఈ హత్య వెనుక నిజమెంతో వెల్లడవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.