B-1 Bombers: ఉగ్రదాడి భయం.. ఫెయిర్‌ఫోర్డ్ నుంచి అమెరికా బీ-1 బాంబర్ల తరలింపు!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై వారం క్రితం జరిగిన ఉగ్రదాడి కుట్రను పోలీసులు గుర్తించి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు లాంచ్ ప్యాడ్‌గా పనిచేస్తున్న ఫెయిర్‌ఫోర్డ్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న భయంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఫెయిర్‌ఫోర్డ్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం నుంచి తమ బీ-1 బాంబర్లను అమెరికాలోని స్థావరాలకు తిరిగి తరలించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. అయితే ఉగ్రదాడి భయంతోనే బాంబర్లను తరలించారా? అన్న ప్రశ్నకు మాత్రం అధికారులు సమాధానం ఇవ్వలేదు. సాధారణంగా బాంబర్లకు ఏదైనా ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటిని యూకేలోని మరో ప్రాంతానికి తరలిస్తారని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఉగ్రకుట్రలో ఇరాన్ ప్రమేయం ఉందా?
కానీ ఈసారి వాటిని యూకేలోని మరో ప్రాంతానికి కాకుండా ఏకంగా అమెరికాకు తరలించడం అసాధారణ పరిణామమని వారు పేర్కొన్నారు.
వారంక్రితం వెలుగులోకి వచ్చిన ఉగ్రకుట్రలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు బలమైన సూచనలు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని వివరాలను సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ ఘటనలో విదేశీ హస్తం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా వెల్లడించారు. అయితే ఈ ఉగ్రకుట్రలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించింది.
కాగా ఈ కేసుకు సంబంధించి యూకే పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.