LOADING...
Trump : భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఎదురు దెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు
లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు

Trump : భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఎదురు దెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు, అందులోనూ భారతీయులకు మరో ప్రతికూల పరిణామం ఎదురైంది. H-1B వీసా దరఖాస్తులపై ఒక్కసారిగా లక్ష డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.84 లక్షలు) ఫీజు విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి కోర్టులో ప్రాథమికంగా మద్దతు లభించింది. ఈ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో, వ్యవహారం ఇప్పుడు అప్పీల్ కోర్టు దశకు చేరింది. ఈ వివాదానికి కారణం గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన. H-1B వీసా విధానంలో భాగంగా, విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే అమెరికా సంస్థలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాలనే నిబంధనను ఆయన ప్రవేశపెట్టారు.

వివరాలు 

ఒబామా నియమించిన జడ్జి మద్దతు కూడా ట్రంప్‌కే 

దీని వల్ల అమెరికా కంపెనీలు విదేశీయుల స్థానంలో తమ దేశ పౌరులకే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు. అయితే, ఈ నిర్ణయం అమలైతే టెక్నాలజీ, హెల్త్‌కేర్, విద్య వంటి కీలక రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా రావడం విశేషం. ఒబామా పాలనలో నియమితులైన జడ్జి బెరిల్ హోవెల్, ఈ విషయంలో అధ్యక్షుడికి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సెక్షన్ 212(f) ప్రకారం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే హక్కు అధ్యక్షుడికే ఉంటుందని, ఇది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కోర్టులు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు.

వివరాలు 

భారతీయులపై తీవ్ర ప్రభావం

ఈ తీర్పుతో ట్రంప్ నిర్ణయానికి బలమైన న్యాయ మద్దతు లభించినట్టయింది. అయితే, ఈ అంశంపై న్యాయపోరాటం ఇంకా ముగిసినట్టు కాదు. డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే అప్పీల్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, మసాచుసెట్స్, కాలిఫోర్నియా వంటి డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ఫీజు పెంపుకు వ్యతిరేకంగా విడివిడిగా కేసులు దాఖలు చేశాయి. ఈ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఈ న్యాయపోరాటం చివరకు అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశం

లక్ష డాలర్ల అదనపు ఫీజు భారం కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద ఐటీ సంస్థలతో పాటు చిన్న స్టార్టప్‌లకు కూడా భారత్ నుంచి నిపుణులను అమెరికాకు పంపడం చాలా కష్టంగా మారనుంది. ఇప్పటికే అమెరికా కాన్సులేట్లలో వీసా ప్రక్రియలో భారీ ఆలస్యం కొనసాగుతుండగా, సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి కొత్త నిబంధనలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ వివాదం చివరకు అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశముందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement