Balogun Red Card Suspension: ట్రంప్ జోక్యంతో బాలోగన్‌కు ఊరట.. సస్పెన్షన్ ఎత్తేసిన ఫిఫా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫుట్‌బాల్ జట్టు కీలక ఆటగాడు ఫోలారిన్ బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా (FIFA) ఎత్తివేసింది. దీంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగే కీలక మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగేందుకు మార్గం సుగమమైంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో అతడిపై నిషేధం తొలగిపోవడం గమనార్హం రౌండ్-32లో బోస్నియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడి కాలి మడిమపై బాలోగన్ తొక్కినట్లు గుర్తించిన రిఫరీ అతనికి రెడ్ కార్డు చూపించారు. ప్రపంచకప్ నిబంధనల ప్రకారం ఆచర్యకు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఫోన్‌లో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడం ఫిఫా చరిత్రలోనే తొలిసారి
అనంతరం కేసును పునఃపరిశీలించిన ఫిఫా బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. "సరైన నిర్ణయం తీసుకుని జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినందుకు ఫిఫాకు ధన్యవాదాలు" అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఆటగాడిపై ఇప్పటికే విధించిన సస్పెన్షన్‌ను తర్వాత దశలో ఎత్తివేయడం ఫిఫా చరిత్రలోనే తొలిసారిగా నిలవడం విశేషం. దీంతో ఈ నిర్ణయం ప్రపంచ ఫుట్‌బాల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఫిఫా నిర్ణయంపై బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఫుట్‌బాల్ నైతిక విలువలకు విరుద్ధమని పేర్కొంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.