Loading...
Typhoon Dujuan: జపాన్‌ను వణికిస్తున్న టైఫూన్ దుజువాన్.. 16 లక్షల మందికి తరలింపు
జపాన్‌ను వణికిస్తున్న టైఫూన్ దుజువాన్.. 16 లక్షల మందికి తరలింపు

Typhoon Dujuan: జపాన్‌ను వణికిస్తున్న టైఫూన్ దుజువాన్.. 16 లక్షల మందికి తరలింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టోక్యో వైపు దూసుకొస్తున్న టైఫూన్ దుజువాన్ జపాన్‌ను వణికిస్తోంది. సోమవారం భారీ వర్షాలు,బలమైన ఈదురుగాలులతో తుపాను ప్రభావం మరింత పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలను రద్దు చేశారు. టోక్యోతో పాటు పరిసర ప్రాంతాల్లో 16లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. అయితే ఈ తరలింపు ఆదేశాలు తప్పనిసరి కాదని జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. దుజువాన్ సోమవారం టోక్యో సమీపంలోని కట్సురా నగరానికి దక్షిణంగా సుమారు 130కిలోమీటర్ల దూరంలో ఉండగా,గంటకు 144కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

వివరాలు 

భారీ వర్షాల ముప్పు.. విమానాలు, రైళ్లకు అంతరాయం

తుపాను ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం వరకు కురిసే వర్షపాతం సెప్టెంబరులో సాధారణంగా నమోదయ్యే నెలవారీ సగటును దాటే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) హెచ్చరించింది.

రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

తుపాను కారణంగా జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) 135 విమానాలను, ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA) 140 విమానాలను రద్దు చేశాయి. టోక్యో పరిసరాల్లో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

టోక్యోతో పాటు చిబా, కనగావా, షిజువోకా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

టోక్యో, పరిసర ప్రాంతాల్లోని కొన్ని రైల్వే మార్గాల్లో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు.

వివరాలు 

భారీ వర్షాలతో వరదలు, కొండచరియల ముప్పు.. పలు కార్యక్రమాలు రద్దు

తుపాను ఉత్తరం వైపు కదులుతున్న సమయంలో వర్షాలు మరింత కొనసాగుతాయని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇజు దీవులు, చిబా ప్రిఫెక్చర్ తదితర ప్రాంతాల్లో శనివారం నుంచి కొన్ని చోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలపై అధికారులు అప్రమత్తం చేశారు.

టైఫూన్ ప్రభావంతో జపాన్‌లో పలు కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి.

ప్రపంచంలోని అతిపెద్ద వీడియో గేమ్ వాణిజ్య ప్రదర్శనల్లో ఒకటైన 'టోక్యో గేమ్ షో' చివరి రోజు కార్యక్రమాలను ముందుగానే ముగించారు.

ADVERTISEMENT

వివరాలు 

కామకురాలో వరదల కలకలం

చిబాలో జరగాల్సిన ఓ భారీ బహిరంగ సంగీత కార్యక్రమంతో పాటు బేస్‌బాల్ మ్యాచ్‌ను కూడా రద్దు చేశారు.

తుపాను ప్రభావంతో ఆసియా క్రీడల్లోనూ కొన్ని ఈవెంట్లకు అంతరాయం ఏర్పడింది.

ఇప్పటికే తుపాను కారణంగా ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, తొమ్మిది ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కామకురాలోని రైల్వే స్టేషన్ సమీప రహదారులు నీట మునిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో వరదలు ఉన్నందున కార్లలో ప్రయాణించడం ప్రమాదకరమని కామకురా మేయర్ తకాషి మాట్సుఓ ప్రజలను హెచ్చరించారు.

ADVERTISEMENT