Flood Threat In Nepal: నేపాల్‌లో మరోసారి వరద ముప్పు.. చౌలానీ నదికి అడ్డుగా కొండచరియలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీ చేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో దార్చులా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొండలపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టి నదిలోకి చేరడంతో ప్రవాహం పాక్షికంగా నిలిచిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియల కారణంగా ఏర్పడిన అడ్డంకి తొలగిపోతే ఒక్కసారిగా దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ నేపథ్యంలో చౌలానీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అత్యవసర ఫోన్ నంబర్లను కూడా విడుదల చేశారు.
ఇటీవల వరదలు, కొండచరియల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే ఈ కొత్త ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
నదిలో కొండచరియల కారణంగా ఏర్పడిన అడ్డంకిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.