LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు.. ఢాకా పర్యటనకు విదేశాంగశాఖ కార్యదర్శి
ఢాకా పర్యటనకు విదేశాంగశాఖ కార్యదర్శి

Bangladesh: బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు.. ఢాకా పర్యటనకు విదేశాంగశాఖ కార్యదర్శి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి ద్వైపాక్షిక చర్చల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్‌తో కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉంది. సోమవారం ఉదయం భారత వాయుసేన విమానంలో ఢాకా చేరుకున్న మిశ్రిని అక్కడ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తరువాత మిశ్రి, జషీముద్దీన్‌లు వివిధ అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా మిశ్రి బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్ తౌహిద్ హోస్సానితో సమావేశం కానున్నారు. అంతేకాదు, ఆ దేశ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్‌తో మర్యాదపూర్వకంగా ఫోన్ ద్వారా మాట్లాడనున్నారు.

వివరాలు 

చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు తీవ్రమవుతున్న వేళ మిశ్రి పర్యటన జరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ అంశంపై న్యాయ సహాయం అందించాలంటూ పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. ఇటీవల త్రిపురలోని అగర్తలాలో ఉన్న బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఆ కార్యాలయాన్ని బంద్ చేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన బంగ్లాదేశ్ 

ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. వారు ఢాకాలో ఉండి పని చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కోల్‌కతా డిప్యూటీ హైకమిషనర్ షిక్దార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, అగర్తలా అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్ రీకాల్ అయిన విషయం తెలిసిందే. ఈ అంశం కూడా మిశ్రి చర్చలలో ప్రాధాన్యత పొందే అవకాశముంది. అలాగే, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డ్రోన్ల మోహరింపు తదితర అంశాలపై కూడా ఇరు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది.