
France bans abaya: పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులపై ఫ్రాన్స్ నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
కొంతమంది ముస్లిం మహిళలు, యువతులు, విద్యార్థులు ధరించే అబాయా దుస్తులపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది.
ఈ నిషేధం ప్రస్తుతానికి పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ అధికారంగా ప్రకటించారు.
అబయా దుస్తులను కొంతమంది ముస్లింలు మాత్రమే ధరిస్తుంటారు. ఈ దుస్తులు వదులుగా ఉండటంతో పాటు పొడవుగా పాదాల వరకు ఉంటాయి.
వేసవి సెలవుల తర్వాత సెప్టెంబరు 4న పాఠశాలలు తిరిగి తెరిచినప్పటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు.
పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో మతపరమైన సంకేతాలు, చిహ్నాలపై ఫ్రాన్స్ కఠినమైన నిషేధాన్నిఅమలు చేస్తుందని బీబీసీ చెబుతోంది. మతపరమైన సంకేతాలు లౌకిక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఫ్రాన్స్ భావిస్తోంది.
ఫ్రాన్స్
రాజకీయ అంశంగా మారిన అబాయా దుస్తుల నిషేధం
2004లో ప్రభుత్వ పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై ఫ్రాన్స్ నిషేధించింది. ఇప్పుడు అబాయాపై నిషేధం విధిస్తున్నారు.
తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు విద్యార్థులను చూసి మతాన్ని గుర్తించరాదని మంత్రి అట్టల్ పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లోనే అబాయాను ఎక్కువగా ధరిస్తున్నారు. ఈ క్రమంలో అబాయాపై కొంతకాలంగా ఫ్రాన్స్‌లో చర్చ జరుగుతోంది.
అంతేకాదు, అబాయా అంశం రాజకీయ చర్చకు దారి తీసింది. మితవాద పార్టీలు అబాయా నిషేధం కోసం ఒత్తిడి తెస్తుండగా, వామపక్షాలు ముస్లిం మహిళలు, బాలికల హక్కుల కోసం అబాయా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
2010లో ఫ్రాన్స్ ప్రభుత్వం ముస్లిం మహిళలపై ఉండే ముసుగులపై నిషేధం విధించింది. ఇది ఫ్రాన్స్‌లోని ఐదు మిలియన్ల మంది ముస్లిం సమాజంలో కోపానికి దారితీసింది.