
France: ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది.ఆ దేశ నూతన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ (Sebastien Lecornu) తన పదవికి రాజీనామా చేశారు. పదవి స్వీకరించి కేవలం నెల రోజులు కూడా పూర్తికాకముందే ఆయన అధికారాన్ని వదిలేశారు. గత నెలలో జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అప్పటి ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోవడంతో, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) సెబాస్టియన్‌ను తదుపరి ప్రధానిగా నియమించిన విషయం తెలిసిందే. అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలతో వారాల తరబడి చర్చలు, సంప్రదింపులు నిర్వహించాడు.
వివరాలు
ఇప్పటికే రెండు సార్లు తాత్కాలిక ప్రభుత్వాలు
ఆ తర్వాత ఆదివారం తన కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించాడు.నేడు మంత్రివర్గ తొలి సమావేశం కూడా జరగాల్సి ఉండగా,మంత్రివర్గం ఏర్పాటు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సెబాస్టియన్ లెకోర్నూ తన రాజీనామాను సమర్పించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన రాజీనామాను అధ్యక్షుడు మాక్రన్ ఆమోదించినట్లు సమాచారం. గత రెండేళ్లలో ఫ్రాన్స్‌లో ఇప్పటికే రెండు సార్లు తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పార్లమెంటులో ప్రధానమంత్రి ఎంపికపై విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి అధ్యక్షుడు మాక్రన్‌కు పెద్ద సవాలుగా మారింది. ఆయన ముందు ఇప్పుడు రెండు మార్గాలే మిగిలాయి.. ఒక కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడం.
వివరాలు
ప్రభుత్వం రద్దు చేసిన 29 నుండి 49 రోజుల మధ్యలో ఓటింగ్
గత రెండేళ్లుగా ఇదే సమస్య మళ్లీ మళ్లీ ఎదురవుతున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై అధ్యక్షుడు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఈసారి మాక్రన్ ఎన్నికలను ప్రకటిస్తే, ప్రభుత్వం రద్దు చేసిన 29 నుండి 49 రోజుల మధ్యలో ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ నుంచే కొత్త ప్రధానిని అధ్యక్షుడు నియమించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా, ఫ్రాన్స్ రాజకీయాల్లో మళ్లీ అనిశ్చితి నెలకొంది.