Choose France Tour: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్.. 30 వేల మందిని ఆకర్షించడమే టార్గెట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ విద్యాసంస్థలు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకొస్తున్నాయి. 2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించేలా చూడాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 50కి పైగా ఫ్రెంచ్ విద్యాసంస్థలతో కలిసి 'చూజ్ ఫ్రాన్స్ టూర్' నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 11న ముంబయి, 13న పుణె, 15న దిల్లీ, 17న బెంగళూరులో జరగనుంది. ఇంజినీరింగ్, సాంకేతిక, బిజినెస్ మేనేజ్‌మెంట్, కృత్రిమ మేధ (ఏఐ), అంతరిక్ష రంగాల్లో అందుబాటులో ఉన్న కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు, కోర్సులు, విద్యాసంస్థల వివరాలను ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలియజేయనున్నారు.
వివరాలు
ఏటా పెరుగుతున్న భారతీయ విద్యార్థులు
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
2024-25 విద్యా సంవత్సరంలో 9,100 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని ఉన్నత విద్యాసంస్థల్లో చేరారు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఇంజినీర్లు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఇరు దేశాల యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించడంలో 'చూజ్ ఫ్రాన్స్ టూర్' తొలి అడుగుగా నిలుస్తుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించిన విషయం తెలిసిందే.