South Dakota: అమెరికాలో అత్యంత లోతైన ల్యాబ్.. ఒకప్పటి బంగారు గనిలో శాస్త్రీయ అద్భుతం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న హోమ్‌స్టేక్ గోల్డ్ మైన్ ఒకప్పుడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద, అత్యంత లోతైన బంగారు గనిగా పేరొందింది. విలువైన లోహాల కోసం దశాబ్దాల పాటు సాగిన తవ్వకాలు ఇప్పుడు ఆగిపోయినా.. అదే ప్రదేశం నేడు విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలను ఛేదించే కీలక పరిశోధనా కేంద్రంగా మారింది.
వివరాలు
బంగారు గని నుంచి పరిశోధనా కేంద్రంగా..
సుమారు 125 ఏళ్ల పాటు కార్యకలాపాలు సాగిన ఈ గని నుంచి ఏకంగా 41 మిలియన్ ఔన్సుల బంగారం, 9 మిలియన్ ఔన్సుల వెండిని వెలికితీశారు.
2001లో గనిలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత దీనిని శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగించాలనే ఆలోచనలు మొదలయ్యాయి.
2006లో గనిని ప్రయోగశాలగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. దాతల సహకారంతో 2007లో ఇది అధికారికంగా పరిశోధనా కేంద్రంగా మారింది.
ప్రస్తుతం ఈ ప్రాంతం అమెరికాలోనే అత్యంత లోతైన భూగర్భ పరిశోధన కేంద్రంగా సేవలందిస్తోంది.
భూమికి సుమారు 4,850 అడుగుల అంటే దాదాపు 1.5 కిలోమీటర్ల లోతులో శాస్త్రవేత్తలు కీలకమైన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
వివరాలు
ఎందుకంత లోతులో ప్రయోగాలు?
సాధారణంగా భూఉపరితలంపై జరిగే ప్రయోగాలపై కాస్మిక్ కిరణాలు, ఇతర రకాల రేడియేషన్ ప్రభావం ఉంటుంది.
అయితే డార్క్ మ్యాటర్ వంటి అత్యంత అరుదైన కణాలను గుర్తించేందుకు నిర్వహించే సున్నితమైన ప్రయోగాలకు ఈ రేడియేషన్ పెద్ద ఆటంకంగా మారుతుంది.
అందుకే శాస్త్రవేత్తలు భూమి లోపల ఇంత లోతైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడి దట్టమైన రాతి పొరలు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి.
దీంతో ఉపరితలం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా అత్యంత సున్నితమైన డిటెక్టర్లతో అరుదైన కణాల కోసం అన్వేషణ సాగించడం సులభమవుతుంది.
వివరాలు
నోబెల్ బహుమతికి దారితీసిన ప్రయోగాలు
ఈ గనికి శాస్త్రీయ చరిత్ర కూడా ఎంతో ప్రత్యేకమైనది. 1960వ దశకంలో ఇక్కడ నిర్వహించిన ప్రయోగాల్లో రేమండ్ డేవిస్ జూనియర్ కీలక పరిశోధనలు చేశారు.
న్యూట్రినోలపై ఆయన చేసిన అధ్యయనాలకు గుర్తింపుగా భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
ప్రస్తుతం ఇదే ప్రాంతంలో విశ్వంలోని మరో కీలక అంశమైన డార్క్ మ్యాటర్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇక్కడ నిర్వహిస్తున్న 'లక్స్-జెప్లిన్' (LUX-ZEPLIN) ప్రయోగం అత్యంత సున్నితమైన డార్క్ మ్యాటర్ డిటెక్టర్లలో ఒకటిగా నిలిచింది.
2022లో దీనిని ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన డార్క్ మ్యాటర్ డిటెక్టర్‌గా గుర్తించారు.
వివరాలు
ఇతర రంగాల్లోనూ పరిశోధనలు
ఈ భూగర్భ కేంద్రంలో కేవలం కణ భౌతికశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలే జరగడం లేదు.
భూమి లోతుల్లో జీవించే సూక్ష్మజీవులు, భూగర్భ జీవజాలం, భూఉష్ణ శక్తి వంటి అనేక అంశాలపైనా శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తున్నారు.
ఒకప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను వెలికితీసిన ఈ చారిత్రక గని.. ఇప్పుడు విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు అవసరమైన అమూల్యమైన సమాచారాన్ని అందిస్తోంది.
బంగారం కోసం భూమిలోకి తవ్విన మార్గమే.. నేడు డార్క్ మ్యాటర్, న్యూట్రినోలు, భూగర్భ జీవజాలం వంటి అనేక రహస్యాల అన్వేషణకు వేదికగా మారడం నిజంగా ఓ శాస్త్రీయ అద్భుతమే.