Trump Gulf Assets: ఖతార్ గోల్ఫ్ క్లబ్స్, దుబాయ్ హోటళ్లు.. ఇరాన్ లక్ష్యంలో టార్గెట్‌లో ట్రంప్ ఆస్తులు..!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా ఇరాన్‌లోని కీలక పౌర మౌలిక వసతులపై దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు వాటికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఖర్గ్ ద్వీపాన్ని తన నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలతో పాటు పికాక్స్ పర్వత ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ఇరాన్ ప్రతీకార లక్ష్యాల జాబితాలో..
ఇరాన్ ప్రతీకార లక్ష్యాల జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌కు చెందిన వాణిజ్య ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం.
ట్రంప్ పేరుతో నడుస్తున్న హోటళ్లు, గోల్ఫ్ క్లబ్బులు, విల్లాలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ జాబితాలో దుబాయ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ రెసిడెన్షియల్ టవర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్‌లో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్స్, ట్రంప్ బ్రాండ్ విల్లాలు, అలాగే జెడ్డా, రియాద్ నగరాల్లోని ట్రంప్ టవర్స్‌తో పాటు ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
వివరాలు
ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులను లక్ష్యంగా అమెరికా దాడులు
అయితే ఈ ఆస్తులపై ఎప్పుడు లేదా ఏ రూపంలో దాడులు జరిగే అవకాశం ఉందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా వరుసగా ఆరో రోజు కూడా రాత్రి వేళ దాడులు కొనసాగించింది.
ఈ చర్యలకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ఇరాన్, ఖతార్, బహ్రెయిన్ వైపు క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం.
దీంతో ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.