Gaza Floods: గాజాలో వరద బీభత్సం.. నిరాశ్రయులైన 70 వేల కుటుంబాలు
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటికే నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియన్లకు ప్రకృతి మరో రూపంలో కష్టాలు తెచ్చిపెట్టింది. శీతాకాలం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. 70 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్న గుడారాలు వరద నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి. తినడానికి తిండి, ఉండటానికి సరైన ఇల్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలకు చలిగాలులు కూడా తోడయ్యాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
వివరాలు
70 వేల కుటుంబాల గుడారాల్లోకి వరద నీరు
గాజా పౌర రక్షణ విభాగం అధికార ప్రతినిధి మహమూద్ బసల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తుఫాను ప్రభావంతో ఒక్క రాత్రిలోనే సహాయం కోరుతూ 1,500కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి.
గుడారాల్లోకి వరద నీరు చేరుతోందని, గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని బాధితులు అధికారులకు సమాచారం అందించారు.
అయితే అవసరమైన పరికరాలు, వాహనాలు, ఇతర వనరులు అందుబాటులో లేకపోవడంతో సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి.
గుడారాల్లో ఉన్న పరుపులు, దుప్పట్లు, వెచ్చని దుస్తులు నీటిలో తడిసిపోయాయి.
దీంతో చలికాలంలో చిన్నారులను ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వివరాలు
12 గంటల్లోనే 60 మిల్లీమీటర్ల వర్షం
గాజా నగరంలో కేవలం 12 గంటల వ్యవధిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
ఇది అక్కడ ఏడాది మొత్తం కురిసే వర్షపాతంలో దాదాపు 15 శాతానికి సమానం. తుఫాను కారణంగా వీచిన బలమైన గాలులకు పలు గుడారాలు ఎగిరిపోయాయి.
మరికొన్ని చిరిగిపోయాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న భవనాల గోడలు కూడా తుఫాను ధాటికి కూలిపోయాయి.
రెండు గోడలు కూలి, వాటిపై ఇనుప రేకులు పడటంతో ఐదుగురు పాలస్తీనియన్లు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ తుఫాను వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 30 లక్షల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
వివరాలు
270 శిబిరాలకు వరద ముప్పు
గాజా నగరంలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు, నిరాశ్రయులు నగరంలోని కేవలం 30 శాతం ప్రాంతంలోనే నివసిస్తున్నారని మున్సిపల్ ప్రతినిధి హోస్నీ ముహన్నా తెలిపారు.
దీంతో ఇప్పటికే దెబ్బతిన్న మౌలిక సదుపాయాలపై ఒత్తిడి మరింత పెరిగింది.
నగరంలోని 270 శిబిరాలు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం కారణంగా డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో ప్రస్తుతం దాని సామర్థ్యం 20 శాతానికి పడిపోయింది.
దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రమాదం ఎక్కువగా ఉంది.
వరద నీరు నిలిచిపోవడం వల్ల అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
2 లక్షల తాత్కాలిక ఇళ్లు అవసరం
గాజాలో ప్రస్తుతం దాదాపు 2 లక్షల తాత్కాలిక ఇళ్లు, భారీ యంత్రాలు అత్యవసరంగా అవసరమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
2025 అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. ముందుగానే సిద్ధం చేసిన తాత్కాలిక ఇళ్లను గాజాలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు.
చలికాలాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన దుప్పట్లు, దుస్తులు, గుడారాలు, నిర్మాణ సామగ్రి, ఇతర సహాయక వస్తువులు చేరాలంటే సరిహద్దు మార్గాలను పూర్తిగా తెరవాలని కోరుతున్నారు.
యుద్ధంలో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు అవసరమైన సామగ్రిపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు.
వివరాలు
19.8 లక్షల మందికి ఆశ్రయం అవసరం
పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ UNRWA జూన్లో నిర్వహించిన సర్వే ప్రకారం.. గాజా జనాభాలో దాదాపు 94 శాతం మందికి, అంటే 19.8 లక్షల మందికి ఆశ్రయంతో పాటు అత్యవసర సాయం అవసరం.
వీరిలో 58 శాతం మంది తీవ్రంగా లేదా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
మరోవైపు, అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (UNOCHA) కూడా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో 9.5 లక్షల మంది నిరాశ్రయులు నివసిస్తున్నట్లు హెచ్చరించింది.
వివరాలు
19.8 లక్షల మందికి ఆశ్రయం అవసరం
వీరిలో 4 లక్షల మందికి పైగా అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నారని తెలిపింది.
2023 అక్టోబర్లో ప్రారంభమైన యుద్ధం గాజాలోని ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసింది.
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పునరావాసం, పునర్నిర్మాణానికి అవసరమైన స్థాయిలో సహాయం అందడం లేదు.
దీంతో ఇప్పటికే యుద్ధంతో సర్వం కోల్పోయిన ప్రజలు ఇప్పుడు భారీ వర్షాలు, వరదలు, చలితో మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు.