Gold Mine Collapses: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 30 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అబ్బా సమీపంలో మంగళవారం ఓ బంగారు గని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 30 మంది గని కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు, స్థానికులు వెల్లడించారు. మరికొందరు కార్మికులు గని శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గనిలో చిక్కుకున్న వారిని రక్షించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కార్మికుడు ఫ్లోరియన్ గగుండే తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
వివరాలు
బురదలో కూరుకుపోయిన యువతీ యువకుల మృతదేహాలు
స్థానికుల సహకారంతో గంటల తరబడి శ్రమించి కూలిపోయిన గని నుంచి ఇప్పటివరకు 30 మంది మృతదేహాలను వెలికితీశారు.
గాయపడిన కార్మికులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
గని ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితులు హృదయవిదారకంగా మారాయి.
బురదలో కూరుకుపోయిన యువతీ యువకుల మృతదేహాలు కనిపించడంతో అక్కడ విషాదం నెలకొంది.
శిథిలాల్లో చిక్కుకున్న వారు సాయం కోసం కేకలు వేయడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళనతో నిండిపోయింది.
ఘటనతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
వివరాలు
గని కార్మికుల భద్రతపై ఆందోళన
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో చిన్నతరహా గనుల తవ్వకాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు.
అయితే ఇక్కడ గనులు కూలిపోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది.
గని కార్మికులకు అవసరమైన భద్రతా సౌకర్యాలు, రక్షణ పరికరాలు తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
తాజాగా జరిగిన ఈ ఘటన మరోసారి గని కార్మికుల భద్రతపై ఆందోళన కలిగించింది.