Loading...
H-1B $100,000 fee case: హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్
హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్

H-1B $100,000 fee case: హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హెచ్-1బీ వీసా దరఖాస్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల రుసుముపై న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ ఫీజును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై త్వరగా తుది తీర్పు ఇవ్వాలని పిటిషనర్లు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టును కోరారు. అయితే,అప్పీల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు ప్రస్తుత విచారణను నిలిపివేయాలని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసు'గ్లోబల్ నర్స్ ఫోర్స్ వర్సెస్ ట్రంప్'పేరుతో కొనసాగుతోంది. అక్టోబర్ 20న కోర్టుకు సమర్పించిన సంయుక్త నివేదికలో హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు లక్షడాలర్ల ఫీజు వసూలు చేయాలన్న నిబంధన చట్టవిరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.

వివరాలు 

2027 జనవరి 14న విచారణ

మరోవైపు, ఈ కేసులో సెప్టెంబర్ 30న వెలువడిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అక్టోబర్ 9న నైన్త్ సర్క్యూట్ అప్పీల్ కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అప్పీల్ కోర్టు నిర్ణయం రాకముందే జిల్లా కోర్టులో విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని వాదించింది.

విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై 2027 జనవరి 14న విచారణ జరగనుంది.

వివరాలు 

కేసుకు సంబంధించిన పరిపాలనాపరమైన రికార్డులను నవంబర్ 3వ తేదీలోగా అందించాలి 

ఈ కేసుకు సంబంధించిన పరిపాలనాపరమైన రికార్డులను నవంబర్ 3వ తేదీలోగా అందించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

అధ్యక్షుడు ట్రంప్ 2025 సెప్టెంబర్‌లో 'ప్రోక్లమేషన్ 10973' ద్వారా ఈ వివాదాస్పద రుసుమును ప్రవేశపెట్టారు.

అనంతరం 2026 సెప్టెంబర్‌లో 'ప్రోక్లమేషన్ 11069' ద్వారా దాని అమలును పొడిగించారు.

అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులు చట్టపరమైన అధికార పరిధిని దాటాయా? ప్రభుత్వ విభాగాలు నిబంధనలను ఉల్లంఘించాయా? అనే అంశాలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

పిటిషనర్ల తరఫున జస్టిస్ యాక్షన్ సెంటర్, డెమోక్రసీ ఫార్వర్డ్ వంటి సంస్థలు న్యాయపరమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT