H-1B Visa: హెచ్-1బీ,ఎల్-1 వీసాల పొడిగింపుకు అదనపు రుసుముల ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో అమెరికా మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ, ఎల్-1 వీసాల పునరుద్ధరణ (రెన్యువల్) ప్రక్రియకూ అదనపు రుసుములు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా గడువు పొడిగింపు కోసం ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే భారతీయ ఐటీ ఉద్యోగులు ఈ మార్పుతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం కొత్తగా హెచ్-1బీ,ఎల్-1 వీసాలు జారీ చేసే సమయంలో అదనపు రుసుములు వసూలు చేస్తోంది.
వివరాలు
పెరగనున్న అమెరికా కంపెనీల ఖర్చులు
అయితే తాజా ప్రతిపాదన ప్రకారం,కొత్త వీసాలకే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణకు కూడా అదే తరహా అదనపు ఫీజులు వర్తించే అవకాశం ఉంది.
దీంతో విదేశీఉద్యోగులను కొనసాగిస్తున్న అమెరికా కంపెనీల ఖర్చులు మరింత పెరగనున్నాయి.
ఇప్పటికే అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులకు కొత్త హెచ్-1బీ వీసాలు మంజూరు చేసే సమయంలో లక్ష డాలర్ల రుసుము వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అమెరికా కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీసా రెన్యువల్‌లపై కూడా అదనపు రుసుములు విధించే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఒక్కో దరఖాస్తుకు కనీసం 4వేల డాలర్ల వరకు చెల్లిస్తున్న యాజమాన్యాలు
ప్రస్తుతం హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు సంబంధించిన పిటిషన్‌ను యాజమాన్యం సమర్పించినప్పుడు లేదా ఒక విదేశీ ఉద్యోగి మరో సంస్థకు మారినప్పుడు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తున్నాయి.
కానీ కొత్తనిబంధనలు అమల్లోకి వస్తే,అదే సంస్థలో ఉద్యోగి కొనసాగుతున్నప్పటికీ అతని వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసిన సమయంలో కూడా ఈ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం యాజమాన్యాలు ఒక్కో దరఖాస్తుకు కనీసం 4వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి.
కొత్తఫీజులు అమల్లోకి వస్తే ఈ వ్యయం మరింత పెరిగి,ముఖ్యంగా సాంకేతికరంగ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఈప్రతిపాదన అమలైతే అమెరికా ప్రభుత్వానికి ఏటా 15కోట్ల డాలర్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.