Russia-Ukraine War: రష్యా రహస్య డేటా లీక్.. బయటపడ్డ సైనికుల మరణాల లెక్కలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సైనికుల ప్రాణనష్టంతో పాటు జనాభా, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు యుద్ధంలో తమ సైనికులు ఎంతమంది మరణించారనే వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అయితే, తాజాగా రష్యా గణాంకాల సంస్థ 'రోస్సాట్'కు చెందిన రహస్య డేటా బయటకు రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. లీకైన మరణాల రికార్డులను విశ్లేషించిన నిపుణులు.. ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు 4.5 లక్షల మంది వరకు రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఏటేటా పెరుగుతున్న సైనిక మరణాలు
అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా సైనికుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
యుద్ధం మొదలైన తొలి ఏడాదితో పోలిస్తే ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రాణనష్టం గణనీయంగా అధికమైంది.
లీకైన డేటాలో యుద్ధ క్షేత్రంలో నేరుగా మరణించిన వారి వివరాలతో పాటు, తీవ్రంగా గాయపడి కొంతకాలం తర్వాత ప్రాణాలు కోల్పోయిన సైనికుల సమాచారమూ ఉన్నట్లు తెలుస్తోంది.
అనారోగ్యం, ఇతర కారణాలతో మరణించిన సైనికుల వివరాలు కూడా పౌర మరణాల రిజిస్ట్రీ రికార్డుల్లో నమోదయ్యాయి.
వీటన్నింటినీ విశ్లేషించడం ద్వారా యుద్ధం కారణంగా రష్యా సైనిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.
వివరాలు
ప్రతి కిలోమీటర్ కోసం భారీ మూల్యం
ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సాధిస్తున్న స్వల్ప పురోగతికి కూడా భారీ ప్రాణనష్టం చవిచూడాల్సి వస్తోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఫ్రంట్‌లైన్‌లో ప్రతి కిలోమీటర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా డొనెట్స్క్ ప్రాంతంలోని బఖ్ముత్‌లో జరిగిన భీకర పోరాటాల్లో వేలాది మంది రష్యా సైనికులు మరణించినట్లు అంచనాలున్నాయి.
ఈ యుద్ధం ప్రభావం సైనికులకే పరిమితం కావడం లేదు. ముఖ్యంగా 30 నుంచి 49ఏళ్ల మధ్య వయస్సున్న పురుషులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటంతో రష్యా జనాభా నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
పని చేసే వయస్సులో ఉన్న పురుషుల సంఖ్య తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.
యుద్ధంలో రష్యాసైన్యం ఎదుర్కొంటున్న ప్రాణనష్టానికి సంబంధించిన సమగ్ర అధికారిక గణాంకాలను మాస్కో ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.
ఈనేపథ్యంలో రోస్సాట్ రహస్య డేటా లీక్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలు,బయటపడుతున్న రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలపై చర్చ మొదలైంది.
యుద్ధంసుదీర్ఘకాలం కొనసాగుతున్న కొద్దీ సైనికుల మరణాలసంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే రష్యాలో జనాభా తగ్గుదల, కార్మికుల కొరత వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా యుద్ధం కారణంగా ఏర్పడుతున్న సామాజిక,ఆర్థిక ఒత్తిళ్లు దేశ అంతర్గత పరిస్థితులపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.