America: భారతీయ సంస్కృతి వైపు అమెరికా?.. ఉమ్మడి కుటుంబాలపై మారుతున్న అభిప్రాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు 20 ఏళ్లు దాటిన తర్వాత కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటే అది స్వతంత్రత లేనట్టుగా భావించే పాశ్చాత్య సమాజంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యువతలో తల్లిదండ్రులతో కలిసి నివసించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో సాధారణంగా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన వివరాల ప్రకారం,అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా గణాంకాల్లో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అమెరికన్లలో 49 శాతం మందికి పైగా కనీసం ఒక తల్లిదండ్రితో కలిసి నివసిస్తున్నారు.
వివరాలు
మన దేశంలో చాలా కాలంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
2019తో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. అలాగే తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్న వారిలో దాదాపు మూడింట ఒక వంతు మంది 25 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. భారతీయులకు ఇది కొత్త విషయం కాదు. మన దేశంలో చాలా కాలంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతోంది. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భావోద్వేగంగా, ఆర్థికంగానూ పరస్పర అండగా నిలుస్తుందని భావిస్తారు. ఉద్యోగం, చదువు లేదా వివాహం వరకు చాలామంది యువత కుటుంబ సభ్యులతోనే కలిసి జీవించడం సహజంగా చూస్తారు. అమెరికాలో ఈ మార్పుతో పాటు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతోంది.
వివరాలు
హోస్ట్ డేవిడ్ లెటర్‌మన్'కి ఐశ్వర్య రాయ్ ఇచ్చిన సమాధానం వైరల్
2005లో హాలీవుడ్ చిత్రం 'Bride and Prejudice' ప్రచారంలో భాగంగా ప్రముఖ హోస్ట్ డేవిడ్ లెటర్‌మన్ కార్యక్రమానికి వెళ్లిన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఇచ్చిన సమాధానం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ కార్యక్రమంలో లెటర్‌మన్, "మీరు ఇప్పటికీ మీ తల్లిదండ్రులతోనే ఉంటారా? భారతదేశంలో అది సాధారణమేనా?" అని ప్రశ్నించారు. దీనికి ఐశ్వర్య రాయ్ ఏమాత్రం తడబడకుండా, "అవును, మాకు తల్లిదండ్రులతో కలిసి ఉండడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే భారతదేశంలో తల్లిదండ్రులను కలవడానికి ముందుగా డిన్నర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు" అని సమాధానమిచ్చారు. అప్పట్లో ప్రేక్షకుల నుంచి చప్పట్ల వర్షం కురిసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వివరాలు
సోషల్ మీడియా వేదికల్లో కుటుంబ జీవితాన్ని పంచుకుంటున్న అమెరికన్లు
ఇక అమెరికాలో కూడా యువత తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న విషయాన్ని దాచిపెట్టడం లేదు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో "స్టే-అట్-హోమ్ డాటర్స్", "స్టే-అట్-హోమ్ సన్స్" పేర్లతో తమ కుటుంబ జీవితాన్ని పంచుకుంటున్నారు. ఒకప్పుడు ఇబ్బందికరంగా భావించిన ఈ జీవనశైలి, ఇప్పుడు సాధారణ కుటుంబ వ్యవస్థగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.