Nepal: మంచు కురిసే చోట.. భారీ వర్షాలు! హిమాలయాల్లో మారుతున్న వాతావరణం
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న వరదల వెనక కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ విపత్తుకు ప్రధాన మూలం పెరుగుతున్న భూతాపమేనని స్పష్టమవుతోంది. హిమాలయ శ్రేణుల్లో 4 వేల మీటర్ల ఎత్తు వరకు సాధారణంగా కురిసే మంచు.. భూతాపం పెరగడంతో భారీ వర్షంగా మారడం ఈ పరిణామానికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. హిమాలయాల్లోని లాంగ్‌టాంగ్ లీరంగ్ పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఓ హిమనీనదం శిథిలం కావడం వల్ల నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయన్నది ఓ వాదన. హిమనదం కూలిపోవడంతో వరదనీటితో పాటు వేల టన్నుల శిథిలాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చి భారీ విధ్వంసానికి కారణమయ్యాయని ఈ వాదన సారాంశం.
వివరాలు
కొండచరియలు విరిగిపడటమే ఈ విపత్తుకు కారణం
అమెరికాకు చెందిన జియలాజికల్ సర్వే సంస్థ కూడా హిమాలయాల్లో ఆకస్మికంగా ఓ హిమఖండం లేదా రాయి విరిగిపడటం వల్ల అక్కడి సరస్సుల్లోని నీరు భారీగా ఉప్పొంగి ఉంటుందని ఇప్పటికే పేర్కొంది.
దీంతో వరదనీరు, శిథిలాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చి ఉండొచ్చని తెలిపింది. మరోవైపు.. భూకంపం కారణంగా మంచు చరియలు, కొండచరియలు విరిగిపడటమే ఈ విపత్తుకు కారణమని మరో వాదన ఉంది.
హిమాలయాల్లోని ఓ భారీ హిమసరస్సు పొంగిపొర్లడం వల్ల ఈ వైపరీత్యం సంభవించిందని మరో సిద్ధాంతం చెబుతోంది. అయితే ఈ పరిణామాలన్నింటికీ మూల కారణం మాత్రం పెరుగుతున్న భూతాపమేనని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.
భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయాల్లో 4 వేల మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాల్లో మంచుకు బదులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.
వివరాలు
ఉత్తరకాశి తరహాలోనే.. మరింత భారీ స్థాయిలో
నేపాల్‌లో చోటుచేసుకున్న విపత్తును అర్థం చేసుకోవడానికి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో గత ఏడాది ఆగస్టులో సంభవించిన వైపరీత్యాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.
నేపాల్‌లో జరిగిన పరిణామం ఉత్తరకాశి ఘటన తరహాలోనే ఉన్నప్పటికీ.. అక్కడ కంటే మరింత భారీ స్థాయిలో చోటుచేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో నాటి విపత్తుకు హిమాలయాల్లో 4 వేల మీటర్ల ఎత్తులోని శ్రీకంఠ్ పర్వతంపై కురిసిన భారీ వర్షమే కారణమైంది.
హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న భూతాపం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమనీనదాలు కరిగే ప్రక్రియ మరింత వేగవంతమవుతోంది.
హిమఖండాలు కరిగి చిన్నవిగా మారుతుండటంతో పర్వత ప్రాంతాల్లో పెద్దపెద్ద రాళ్లు, ఇసుక, మట్టి వంటి శిథిలాలు పేరుకుపోతున్నాయి.
వివరాలు
మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఈ శిథిలాల్లో భారీగా నీరు నిల్వ అవుతోంది.
ఆ తర్వాత కొండచరియలు విరిగిపడటం లేదా పర్వత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ నీరు, శిథిలాలు ఒక్కసారిగా దిగువకు కొట్టుకొస్తున్నాయి.
దీంతో వరదనీటితో పాటు భారీ మొత్తంలో రాళ్లు, ఇసుక, మట్టి తదితర శిథిలాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.