ఫ్రాన్స్ లో పెల్లుబీకుతున్న ప్రజా నిరసన జ్వాలలు.. 150 మంది అరెస్ట్
ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 ఏళ్ల డెలివరీ బాయ్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఫ్రెంచ్ దేశంలో అలజడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పారిస్ శివారు ప్రాంతమైన నాంటెర్రిలో మంగళవారం ట్రాఫిక్ తనిఖీల నేపథ్యంలో నయెల్ అనే డెలివరీ బాయ్ ని అనుమానంతో పోలీసులు కాల్చి చంపారు. అమాయకుడైన యువకుడిని పొట్టన బెట్టుకున్నారని ఆరోపిస్తూ సెలబ్రెటీలు పోలీస్ అధికారులపై భగ్గుమంటున్నారు. ఈ నిరసనలను, అల్లర్లను అదుపు చేసేందుకు భద్రతా దళాలతో పాటు సుమారు 2,000 మంది అదనపు బలగాలను మోహరించారు. అయినప్పటికీ నిరసనలు అదుపులోకి రాకపోవడం గమనార్హం.
ఇప్పటివరకు దాదాపు 150 మందిని అరెస్ట్ చేశాం
ఈ ఆందోళనలు మరిన్ని నగరాలకు విస్తరించాయని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి నాన్‌టెర్‌లోని చెత్త డబ్బాలకు నిరసనకారులు నిప్పంటించారు. అంతేకాకుండ భారీ ఎత్తున బాణాసంచా పేల్చి నిరసన తెలియజేశారు. మరోవైపు దక్షిణ నగరమైన టౌలౌస్‌లో పలు కార్లకు నిప్పు అంటించారు. ఈ ఘటనను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫలితంగా అక్కడ దట్టమైన నల్లని పొగ కమ్మేసిందని చెప్పారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 150 మందిని అరెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్ హోంశాఖ మంత్రి గెరాల్డ్ డర్మానిన్ వెల్లడించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పలు నగరాల్లోని ప్రభుత్వ భవనాలు, కాలేజీలు, పోలీస్ స్టేషన్‌లకు నిప్పుపెట్టారని సమాచారం.