Loading...
Highly unlikely:  ఇరాన్‌పై అమెరికా దాడులు లేనట్టేనా?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా దాడులు లేనట్టేనా?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Highly unlikely:  ఇరాన్‌పై అమెరికా దాడులు లేనట్టేనా?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా మళ్లీ పెద్ద ఎత్తున సైనిక చర్యలకు దిగే అవకాశం చాలా తక్కువగా ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించడం, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలపై ఒప్పందం కుదరడాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు, ఇరాన్‌లోని 38 వంతెనలతో పాటు ఇతర కీలక మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.

వివరాలు 

CNN ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు

ఆదివారం CNNకు ఇచ్చిన సుమారు 20 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.

ఇరాన్ విస్తృతమైన దౌత్య ఒప్పందానికి అంగీకరిస్తే మరోసారి సైనిక ఘర్షణలు తలెత్తే పరిస్థితిని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇరాన్ బలమైన ఒప్పందంపై సంతకం చేస్తుందా? లేదా? అనే అంశంపైనే తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు.

ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివర్ణించిన ఆయన.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిందని పేర్కొన్నారు.

అవసరమైతే మళ్లీ చర్యలు తీసుకుంటానని, అయితే ఇప్పటికే ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీశామని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఆర్థికంగా, సైనికంగా ఇరాన్ బలహీనపడిందా?

అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు, గతంలో చేపట్టిన సైనిక దాడుల కారణంగా ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా తగ్గిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఆ దేశం ఆర్థికంగా బలహీనపడుతోందని, సైనికంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొందని అన్నారు.

అవసరమైతే ఇరాన్‌ను పూర్తిగా దెబ్బతీసే సామర్థ్యం అమెరికాకు ఉందని హెచ్చరించారు.

అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి భారీ స్థాయిలో సైనిక దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పునరుద్ఘాటించారు.

ADVERTISEMENT

వివరాలు 

38 వంతెనలు అమెరికా లక్ష్యాలుగా గుర్తింపు

ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను కూడా అమెరికా లక్ష్యాలుగా గుర్తించినట్లు ట్రంప్ వెల్లడించారు.

కూల్చివేయగలిగే 38 వంతెనలను ఇప్పటికే గుర్తించామని, వాటిని కేవలం గంట వ్యవధిలోనే ధ్వంసం చేయగలమని వ్యాఖ్యానించారు.

అయితే, వంతెనలను కూల్చివేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.

వాటిని నిర్మించడం ఎంతో కష్టమైన పని అని, ఒక వంతెన నిర్మాణానికి సంవత్సరాల సమయం పడుతుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు

మరోవైపు,ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

అన్ని రంగాల్లో శత్రుత్వానికి ముగింపు పలికేలా టెహ్రాన్ ప్రతిపాదించిన షరతులను అంగీకరించాలని సూచించారు.

లేదంటే అమెరికా తీవ్ర సైనిక ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ఆయన..ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.

అమెరికా ఓటర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని వెల్లడించారని,ఇప్పుడు వైట్‌హౌస్ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అరాఘ్చీ పోస్టు చేశారు.

ఇరాన్ ప్రతిపాదన ఇప్పటికీ అమల్లోనే ఉందని స్పష్టం చేశారు.

అన్ని రంగాల్లో యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు తాము సూచించిన నిర్దిష్ట షరతులను అంగీకరిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని తెలిపారు.

వివరాలు 

ఇరాన్‌తో మిషన్ ఇంకా పూర్తి కాలేదు: ఇజ్రాయెల్

ఒకవేళ అమెరికా యుద్ధ మార్గాన్నే ఎంచుకుంటే,అప్రమత్తంగా ఉన్న తమ సైనిక బలగాలు, యుద్ధ అనుభవం కలిగిన దళాలు గట్టిగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా,ఇరాన్ విషయంలో తమ లక్ష్యం ఇంకా నెరవేరలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.

అవసరమైతే మరోసారి దాడులు చేపట్టే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.

ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకునే ప్రయత్నాలను తిరిగి ప్రారంభిస్తోందని ఆరోపించారు.

అయితే,తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించేందుకు మళ్లీ ప్రయత్నిస్తోందని,ఆ దేశం చేపడుతున్న మరికొన్ని తీవ్రమైన చర్యలు కూడా ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని కాట్జ్ పేర్కొన్నారు.

ఇరాన్‌పై తమ సైనిక లక్ష్యాలు ఇంకా పూర్తికాలేదని,పరిస్థితులను బట్టి తదుపరిచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ADVERTISEMENT