945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్
ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇకపై బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ఎక్కడా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని హాంకాంగ్ నాయకుడు జాన్ లీ పేర్కొన్నారు. హాంకాంగ్‌ను ఫైనాన్స్ హబ్‌ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పర్యాటకులు, విదేశీ కార్మికులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్చిలో హాంకాంగ్‌లో అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణ
వచ్చే నెలలో హాంకాంగ్ అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌లను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వరుసగా కరోనా ఆంక్షలను తొలగిస్తూ వస్తోంది. అందుకే మాస్క్‌ను తొలగించడానికి సమయం ఆసన్నమైందని లీ పేర్కొన్నారు. హాంకాంగ్‌లో జూలై 29, 2020 నుంచి ప్రజలు ఆరుబయట సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలను విధించింది. ఈ భూమిపై ప్రస్తుతం మాస్క్ ధరించడాన్ని తప్పసరి చేసి అమలు చేస్తున్న ఏకైక దేశం హాంకాంగ్ కావడం గమనార్హం. బుధవారంతో అంటే 945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలను ప్రభుత్వం తొలగిస్తోంది.