LOADING...
World Trade Organization: మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక
మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక

World Trade Organization: మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఇప్పటికే అనేక దేశాలను కష్టాల్లోకి నెట్టుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా ఎరువుల రవాణా కూడా తీవ్రంగా దెబ్బతింటోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేన్ మేరీ పౌగమ్ తెలిపారు. యూరియా సరఫరా అంతరాయం కారణంగా ఎరువుల కొరతతో పాటు ధరలు పెరగడం వల్ల ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని ఆమె హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ ఎరువులలో సుమారు మూడో వంతు గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ మార్గం ద్వారా రవాణా అవుతున్నాయి.

వివరాలు 

భవిష్యత్ పంటలపై ప్రభావం

ఈ మార్గం మూసివేత కొనసాగితే యూరియాపై ఆధారపడే వ్యవసాయ దేశాల్లో నిల్వలు తగ్గిపోవచ్చు. ప్రస్తుతం యుద్ధం ప్రారంభమై కొద్దికాలమే కావడంతో ఎరువుల కొరత పెద్దగా కనిపించకపోయినా, దీని అసలు ప్రభావం వచ్చే ఏడాది పంటలపై పడే అవకాశముంది. ఒకవేళ దేశాలు ముందుగానే ఎరువులు, ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరాయం కలుగుతుంది. దీని వల్ల ఆహారం దిగుమతి చేసుకునే పేద దేశాలు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉంది.

వివరాలు 

భారత్‌పై ప్రభావం

యూరియా తయారీలో కీలకమైన ద్రవరూప సహజ వాయువు (LNG)ను భారత్ గత కొన్నేళ్లుగా ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి సరఫరా నిలిచిపోవడం వల్ల భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి ప్రధాన ఆహార ఎగుమతిదారులలోని కొన్ని యూరియా తయారీ సంస్థలు తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ధరల పెరుగుదల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. సరఫరా లోపం కారణంగా ఇతర ఎరువుల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భారత్, బ్రెజిల్ వంటి ఎరువులను అధికంగా వినియోగించే దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఆహార ధరలపై ప్రభావం

అమెరికా కూడా యూరియాకు పెద్ద మార్కెట్ అయినప్పటికీ, నత్రజని ఉత్పత్తిలో సగానికి పైగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవడం వల్ల అక్కడ ప్రభావం తక్కువగా ఉండొచ్చు. ఎరువుల ధరలు పెరగడం రైతుల ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది. అదే సమయంలో చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా అధికమవుతాయి. ఈ రెండు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది గ్లోబల్‌గా ఆహార ధరలు సుమారు 2 శాతం వరకు పెరగవచ్చు.

Advertisement