Houthi attacks on Saudi: సౌదీపై హూతీల దాడులు.. 73 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా,యెమెన్‌లోని హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. మంగళవారం తెల్లవారుజామున సౌదీపై హూతీలు చేసిన దాడుల్లో 73మంది గాయపడినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో మహిళలు,చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తామని సంకీర్ణ దళాల ప్రతినిధి టుర్కీ అల్ మల్కి స్పష్టం చేశారు. జైలుపై దాడి జరిగిందంటూ ఆరోపణ అంతకుముందు రోజు యెమెన్‌లోని ఓ జైలుపై సౌదీ వైమానిక దాడి చేసిందని హూతీలు ఆరోపించారు. హజ్మ్ నగరంలోని సెంట్రల్ కరెక్టివ్ ఫెసిలిటీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో ఓ చిన్నారి సహా ఏడుగురు మరణించినట్లు హూతీల ఆరోగ్యశాఖప్రతినిధి అనీస్ అల్ అస్బాహీ తెలిపారు. మరో ఏడుగురు గాయపడినట్లు వెల్లడించారు.
వివరాలు
35 మంది ఖైదీలు శిథిలాల కింద..
దాడి ధాటికి జైలు భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద 35 మంది ఖైదీలు చిక్కుకున్నట్లు హూతీలు తెలిపారు.
తన భర్తను కలిసేందుకు జైలుకు వచ్చిన ఓ మహిళ కూడా శిథిలాల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
జైలు భవనం ధ్వంసమైన దృశ్యాలను హూతీల అధికారిక టీవీ ఛానల్ ప్రసారం చేసింది.
కూలిపోయిన భవనం శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది చేపడుతున్న చర్యలను ఆ వీడియోలో చూపించారు.
వివరాలు
ప్రతీకారం తప్పదన్న హూతీలు
సౌదీ దాడికి ప్రతీకారం తప్పదని హూతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ హెచ్చరించారు.
గత 24 గంటల్లో సౌదీకి చెందిన నాలుగు నిఘా డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన ప్రకటించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన నౌకలు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించకుండా సముద్ర దిగ్బంధనం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఎర్ర సముద్రంలో తమ ఆదేశాలను ఉల్లంఘిస్తూ సౌదీ నౌకలు ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాహ్యా సరీ హెచ్చరించారు.
దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సౌదీ-హూతీల మధ్య పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.