Google Techie: గూగుల్ సీక్రెట్ డేటాతో రూ.11.5 కోట్లు సంపాదించిన టెక్కీ.. పోలీమార్కెట్ బెట్టింగ్‌తో బంపర్ లాభం
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్‌లో పనిచేస్తున్న ఓ టెక్కీ.. కంపెనీకి చెందిన రహస్యమైన సెర్చ్ డేటాను ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదించిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. పోలీమార్కెట్ అనే క్రిప్టో ఆధారిత ప్రిడిక్షన్ మార్కెట్‌లో బెట్టింగ్ పెట్టి సుమారు 1.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.5 కోట్లు) సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్ ఉద్యోగి మిచెల్ స్పాగ్నుఓలోను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. 36 ఏళ్ల మిచెల్ స్పాగ్నుఓలో ఇటలీకి చెందిన వ్యక్తి. 2014 నుంచి గూగుల్‌లో పనిచేస్తున్న అతడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య గూగుల్‌కు చెందిన అంతర్గత సెర్చ్ డేటాను ఉపయోగించి పోలీమార్కెట్‌లో భారీ మొత్తాల్లో బెట్లు పెట్టినట్లు ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదులో వెల్లడైంది.
వివరాలు
2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ పై బెట్టింగ్
దర్యాప్తు సంస్థల ప్రకారం.. సాధారణ ప్రజలకు తెలియని గూగుల్ అంతర్గత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఈ బెట్టింగ్‌లు పెట్టాడని ఆరోపించారు. ఇతర ట్రేడర్లకు తెలియని ఫలితాలు అతడికి ముందే తెలిసి ఉండటంతో భారీ లాభాలు ఆర్జించినట్లు కేసులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు అనే బెట్టింగ్‌లో అతడు సరిగ్గా అంచనా వేశాడు. అమెరికన్ సింగర్ డి4వీడీ (D4vd) పేరు టాప్‌లో ఉంటుందని ముందుగానే బెట్టింగ్ పెట్టి భారీగా గెలిచాడు. అప్పట్లో పోలీమార్కెట్‌లో డి4వీడీ టాప్ సెర్చ్ అవుతాడనే అవకాశాలు దాదాపు లేవని భావించినా.. "ఆల్ఫా రాకూన్" పేరుతో ఉన్న అతడి అకౌంట్ మాత్రం సరైన ఫలితాన్ని అంచనా వేసింది.
వివరాలు
గూగుల్ స్పందన
డి4వీడీపై 14 ఏళ్ల సెలెస్టే రివాస్ హెర్నాండెజ్ హత్య కేసులో ఆరోపణలు ఉండటంతో అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో గూగుల్ సెర్చ్‌లలో అతడు టాప్‌లో నిలిచినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించిన గూగుల్ ప్రతినిధి.. చట్ట అమలు సంస్థలతో కలిసి దర్యాప్తుకు సహకరిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండే టూల్ ద్వారా మార్కెటింగ్ మెటీరియల్‌ను యాక్సెస్ చేసినప్పటికీ, రహస్యమైన సమాచారాన్ని బెట్టింగ్‌ల కోసం ఉపయోగించడం కంపెనీ పాలసీలకు విరుద్ధమని చెప్పారు. ప్రస్తుతం ఆ ఉద్యోగిని సెలవుపై పంపినట్లు వెల్లడించారు.
వివరాలు
అమెరికా సైనికుడిపైనా ఇదే తరహా ఆరోపణలు
ఇటీవల అమెరికాకు చెందిన ప్రత్యేక దళాల సైనికుడు గ్యానన్ కెన్ వాన్ డైక్‌పైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో అరెస్టుకు సంబంధించిన గోప్య సమాచారం ముందుగానే తెలుసుకుని పోలీమార్కెట్‌లో బెట్టింగ్ పెట్టినట్లు అధికారులు ఆరోపించారు. ఈ కేసులో అతడు 4 లక్షల డాలర్లకుపైగా గెలుచుకున్నట్లు సమాచారం. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అతడు కోర్టులో ఖండించాడు.