LOADING...
Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్‌ డీల్‌పై ట్రంప్‌ ప్రకటనలు ఫలించాయా?
3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్‌ డీల్‌పై ట్రంప్‌ ప్రకటనలు ఫలించాయా?

Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్‌ డీల్‌పై ట్రంప్‌ ప్రకటనలు ఫలించాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు. గత మూడు నెలల వ్యవధిలోనే ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని ట్రంప్‌ ఏకంగా 37 సార్లు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే,ఈ ప్రకటనలకు విరుద్ధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల అనంతరం ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు, శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్‌ ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించారు. మార్చి 23న మీడియాతో మాట్లాడిన ఆయన, శాంతి చర్చల్లో అనేక కీలక అంశాలపై పురోగతి సాధించామని చెప్పారు.

వివరాలు 

అమెరికాతో ఒప్పందం కోసం టెహ్రాన్‌ ఆసక్తి

అనంతరం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో కూడా అమెరికాతో ఒప్పందం కోసం టెహ్రాన్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న మరోసారి స్పందించిన ట్రంప్‌.. ఇరాన్‌తో ఒప్పందం కుదరడానికి చాలా దగ్గరలో ఉన్నామని వెల్లడించారు. మరుసటి రోజే ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. తొలుత రెండు వారాల పాటు అమలైన ఈ కాల్పుల విరమణను తర్వాత మరికొంతకాలం పొడిగించారు. అదే సమయంలో శాంతి చర్చలు కూడా కొనసాగుతూనే వచ్చాయి. ఇలా వరుసగా ప్రకటనలు చేస్తున్న ట్రంప్‌ ఇప్పటివరకు 37 సార్లు ఒప్పందం సమీపంలోనే ఉందని చెప్పినట్లు మీడియా విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే, ఇరాన్‌ మాత్రం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను పదేపదే ఖండిస్తోంది.

వివరాలు 

హర్మూజ్‌ సమీపంలో కూలిన అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్

అమెరికా ప్రతిపాదిస్తున్న షరతులను తాము అంగీకరించడం లేదని, ఒప్పందంలోని కీలక అంశాలపై ఇప్పటికీ ఏకాభిప్రాయం ఏర్పడలేదని టెహ్రాన్‌ స్పష్టం చేస్తోంది. దీంతో ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో మొదట్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణి దాడులు చేపట్టగా, ఇజ్రాయెల్‌ కూడా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరుపక్షాలు వెంటనే కాల్పులు నిలిపివేయాలని ట్రంప్‌ పిలుపునిచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇదే సమయంలో హర్మూజ్‌ సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ కూలిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement