
US: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది దుర్మరణం!
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టెనెస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో కనీసం 19 మంది అక్కడికక్కడే మరణించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సైనిక, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్య అవసరాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే ఆ సంస్థలో ఈ విపరీత ఘటన జరిగింది. పేలుడు ప్రభావం అంత తీవ్రంగా ఉండటంతో సమీప నివాస గృహాలు కుదుపునకు గురయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Details
పలువురు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం
ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు తీవ్రత కారణంగా అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకోలేకపోయారు. హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ ఈ విషాదాన్ని 'వినాశకర పేలుడు'గా అభివర్ణించారు. ఉదయం ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పలువురు ఆచూకీ తెలియకుండా పోయారని, కొద్ది మంది మాత్రమే సజీవంగా బయటపడ్డారని వెల్లడించారు. మిగతా వారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అన్నారు. శుక్రవారం ఉదయం 7:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వివరించారు.