Reno,Nevada: నెవాడాలో భారీ కార్చిచ్చు.. 90 వేల మంది తరలింపు.. మానవ తప్పిదమే కారణమా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. మంటల తీవ్రతతో అధికారులు దాదాపు 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు మానవ తప్పిదం కారణంగానే సంభవించినట్లు అధికారులు తాజాగా నిర్ధరించారు. అయితే అసలు మంటలకు కారణమైన వ్యక్తి ఎవరు? అవి ఏ విధంగా వేగంగా వ్యాపించాయి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. లగ్జరీ భవనాలు, వ్యాపార సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఉన్న పీవైన్ పీక్ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి అగ్నికీలలు వేగంగా విస్తరించి ఇప్పటివరకు సుమారు 20 చదరపు మైళ్ల ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వివరాలు
60వేల నివాసాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
అగ్నిమాపక చర్యలను ముమ్మరం చేసేందుకు నెవాడా నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.
సహాయక చర్యల్లో భాగంగా హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నారు. అయితే బలమైన గాలులు వీస్తుండటంతో మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారిందని స్థానిక అధికారులు తెలిపారు.
కార్చిచ్చు ధాటికి రెనో నగరంలోని అనేక నివాస, వ్యాపార భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మంటల కారణంగా దాదాపు 60వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నెవాడా గవర్నర్ జో లొంబార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారి కోసం వందల సంఖ్యలో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు.
మంటలకు అసలు కారణం, వాటి వ్యాప్తికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.