Page Loader
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా
ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హైడ్రామా

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ మాజీ ప్రధాని బెయిల్ రద్దు అయిన తర్వాత ఖాన్ ఇంటి వెలువల పోలీసుల వ్యాన్ కనిపించింది. దీంతో పోలీసులు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేస్తున్నారని వార్త వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు ఆ ప్రాంతానికి చేరుకొని నిరసనలు తెలియజేశారు. జెండాలు ఊపుతూ, బ్యానర్లు చేతపట్టుకొని బ్యాక్ గ్రౌండ్ పాటలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్

మాజీ ప్రధానిని అరెస్టు చేస్తే దేశం వీధిన పడుతుంది

పెద్ద ఎత్తున మద్దతుదారులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. జమాన్ పార్క్‌కు వెళ్లే మార్గంలో పోలీసుల వాహనాలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. మాజీ ప్రధాని ఖాన్ అరెస్టు ఆసన్నమైనట్లు వార్తలు గుప్పమనడంతో పోలీసులను అడ్డుకోవడానికి మహిళలు, పిల్లలతో సహా జమాన్ పార్క్ వద్ద గుమిగూడారు. ఖాన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే దేశం మొత్తం వీధిన పడుతుందని పీటీఐ నాయకుడు ముసరత్ జంషైద్ చీమా అన్నారు. పార్టీ అధినేతను అరెస్ట్‌ చేసే ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్ రద్దు చేయడంతో మాజీ ప్రధాని ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.