అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు. అందులో భాగంగా అమెరికన్ చరిత్రలో అతిపెద్ద దేశీయ బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని ప్రకటించారు. చట్టవిరుద్ధంగా అమెరికా రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలను బహిష్కరిస్తానని చెప్పారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన బహిరంగ సరిహద్దు విధానాన్ని తాను రద్దు చేస్తానని చెప్పారు. అమెరికాపై దండయాత్ర జరుగుతోందన్నారు. ఐసెన్‌హోవర్ మోడల్‌ను అనుసరించి, అమెరికా చరిత్రలో అతిపెద్ద దేశీయ బహిష్కరణ చర్యను నిర్వహించడానికి అన్ని రాష్ట్ర, సమాఖ్య సైనిక వనరులను ఉపయోగిస్తానని పేర్కొన్నారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్
చట్టవిరుద్ధంగా రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలను బహిష్కరించడం గురించి ట్రంప్ మాట్లాడటం ఇది మొదటిసారేమి కాదు. 2019లో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న లక్షలాది మందిని బహిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఇదిలా ఉంటే, 2024లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ట్రంప్ పలు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 2020లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించినట్లు ట్రంప్ తాజాగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ తిరస్కరించారు. వీటిని రాజకీయ కోణంలో చేస్తున్న ఆరోపణలుగా ఆయన తిప్పికొట్టారు.