'2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడితే పుతిన్‌కు తిరుగుండదు'
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆయనకు పోటీగా నిలిచే ప్రత్యర్థులు లేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అయితే పుతిన్ తాను పోటీ చేస్తానని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని డిమిత్రి పెస్కోవ్ చెప్పారు. కానీ అధ్యక్షుడు అభ్యర్థిగా నిలబడతారని మేము ఊహిస్తే, ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడికి నిజమైన పోటీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. పుతిన్‌కు ప్రస్తుతం ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రష్యాలో అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఏర్పడిన గందరగోళం తర్వాత రష్యాలో సుస్థిరమైన పాలనను తీసుకొచ్చి, ప్రబలమైన నాయకుడిగా పుతిన్ ఎదిగారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో పెరిగిన పుతిన్ ఫాలోయింగ్
1962లో క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలు- రష్యా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. అలాగే గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య పుతిన్ పాలనకు పెద్ద సవాలుగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై పశ్చిమ దేశాలు అత్యంత కఠినమైన ఆంక్షలను విధించాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆర్థికంగా దెబ్బతిన్నా, ఆ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ అని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. లెవాడా-సెంటర్ ప్రకారం, ఆగస్టులో, అతని ఆమోదం రేటింగ్ 80% ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి కంటే ముందు 70% ఉండటం గమనార్హం.