Page Loader
Israel-Hamas ceasefire : కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల
కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల

Israel-Hamas ceasefire : కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు అమల్లోకి రావాల్సి ఉన్నా హమాస్ నుండి బందీల జాబితా విడుదలలో జాప్యం కారణంగా దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు హమాస్, ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు బందీలను విడుదల చేసింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో రోమి గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్ స్టెయిన్ బ్రేచర్ (31) ఉన్నారు. బందీలు స్వదేశానికి చేరుకున్న సందర్భంగా టెల్ అవీవ్‌లో వేలాది మంది ప్రజలు గుమికూడారు. వీక్షణ కోసం రోడ్లపై పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Details

90 మంది పాలస్తీనా ఖైదీలు విడుదల

మరోవైపు గాజాలో ప్రజలు ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు స్వస్థలాలకు వెళ్లడం మొదలైంది. మొదటి దశలో 90మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. మొదటి దశలో కాల్పుల విరమణ 42 రోజులు కొనసాగనుంది. జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగడం ప్రారంభిస్తాయి. గాజాలోకి ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు అనుమతి ఇస్తుంది. మిగిలిన బందీలను రెండో దశలో హమాస్ విడుదల చేయనుంది.

Details

46వేల మందికి పైగా పాలస్తీనీయులు మృతి

2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన తర్వాత పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. ఈ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 250 మందిని హమాస్ బందీలుగా తీసుకుంది. ఇక ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేపట్టగా 46,000 మందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పదిహేను నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడినా దీర్ఘకాలం శాంతి నెలకొంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖైదీల విడుదల