Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి అదియాలా జైలుకు తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రి నుంచి తిరిగి అదియాలా జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటలకే మళ్లీ జైలుకు తరలించడం గమనార్హం. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
వివరాలు
సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరిన పాకిస్థాన్ ప్రధాని
2023ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ఆయన కుడి కంటిచూపు బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను 48గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని, ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో పాటు ప్రత్యేక వైద్య నిపుణులతో కూడిన మెడికల్ ప్యానెల్‌ను అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తొలుత అంగీకరించింది.
అయితే ఆ తర్వాత ఆ ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరింది.
దోషులుగా తేలిన ఖైదీలకు జైలులోనే లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాల్సి ఉంటుందని పాకిస్థాన్ న్యాయశాఖమంత్రి ఆజంనజీర్ తరార్ వాదించారు.
వివరాలు
షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రి వద్దకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు
అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌధరీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు.
దేశంలో సరైన వైద్యం అందుబాటులో లేకపోతే విదేశాల్లో చికిత్స చేయించే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, మద్దతుదారులు ఆస్పత్రి బయట గుమిగూడి ఇమ్రాన్‌కు మరింతకాలం ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్‌లో పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత పలు కేసుల్లో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లారు.
అప్పటి నుంచి ఆయన జైలు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.