LOADING...
Enriched Uranium: శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ధ్వంసం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ధ్వంసం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

Enriched Uranium: శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ధ్వంసం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను అమెరికాకు తరలించి అక్కడ ధ్వంసం చేయడం లేదా ఇరాన్ సహకారంతో ఆ దేశంలోనే గానీ, మరో ప్రాంతంలో గానీ నిర్మూలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లేదా దానికి సమానమైన సంస్థ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యురేనియం నిల్వలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

వివరాలు 

యురేనియం శుద్ధి ప్రక్రియ కొనసాగిస్తాం: ఇరాన్ 

ఇరాన్ తన యురేనియం కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే తాము యురేనియం శుద్ధి ప్రక్రియను కొనసాగిస్తామని టెహ్రాన్ ఇప్పటికే ప్రకటించింది. తాము అణ్వస్త్రాల తయారీకి ప్రయత్నించడం లేదని ఇరాన్ అధికారులు చెబుతున్నప్పటికీ, అమెరికా మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా, తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి అమెరికన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వివరాలు 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం

అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మాధ్యమాలు తెలిపాయి. ఖతార్ రాజధాని దోహాలో జరగనున్న సమావేశంలో ఇరాన్ యురేనియం అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. రాబోయే రెండు నెలల్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ఇరాన్ ఆలోచిస్తున్నట్లు విదేశీ మాధ్యమాలు వెల్లడించాయి.

Advertisement