LOADING...
UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్
భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్

UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే చరిత్రలో మిగిలిపోయిన శిలాజంలా మారిపోతుందని భారత్ హెచ్చరించింది. 1945 నాటి పాత కంప్యూటర్ వ్యవస్థను అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికతతో నడపడానికి ప్రయత్నించినట్లే అలాంటి పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రపంచ అవసరాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐరాస కూడా మరింత చురుకుగా, సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రతామండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేనిహరీశ్ మంగళవారం జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఐరాస చట్టబద్ధత,సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతి,భద్రత పరిరక్షణలో భద్రతామండలి పనితీరుపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు.

వివరాలు 

సభ్య దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది: హరీష్ 

ప్రపంచ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఐరాస వ్యవస్థలోనూ తగిన మార్పులు జరగాలని హరీశ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం విజయం సాధించిన దేశాలు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంతో పాటు ప్రత్యేక వీటో అధికారాన్ని కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలి మార్పులు స్వీకరించకపోతే దాని అధికారం, విశ్వసనీయత, చట్టబద్ధత, సామర్థ్యం మరింతగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఒకే అంశంపై వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రమాణాలు అనుసరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

వివరాలు 

ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించాల్సిందే

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తన చర్యల ఫలితాలను తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. భద్రతామండలిలో జరిగిన చర్చ సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ జమ్మూకశ్మీర్ అంశంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ప్రతిస్పందించిన పర్వతనేని హరీశ్, చట్టబద్ధంగా భారత్‌లో భాగమైన ప్రాంతాలపై పాకిస్థాన్ కన్నేసిందని విమర్శించారు.

Advertisement

వివరాలు 

పలుమార్లు ఐరాస నిబంధనలను ఉల్లంఘించిన పాక్ 

సరిహద్దు దురాక్రమణలను భారత్ నిరంతరం ఎదుర్కొంటోందని చెప్పారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ పలుమార్లు ఐరాస నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. సరిహద్దుల ద్వారా జరిగే ఉగ్రదాడుల నుంచి దేశాన్ని రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలకు పాకిస్థాన్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్‌కు నష్టం కలిగించాలనే ధోరణిని పాకిస్థాన్ వీడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement