Marco Rubio: భారత్ ఒక్క రాత్రిలో రష్యా చమురును వదిలేయలేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన రూబియో
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాపై ఆంక్షల్లో భాగంగా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తే అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని విశ్లేషించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఉజ్బెకిస్థాన్, భారత్లో వారం రోజుల పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
భారత్పై సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయానికి 60 రోజుల సమయం
'లిండ్సే గ్రాహం చట్టం'లోని నిబంధనల అమలుకు ట్రంప్ తాత్కాలిక మినహాయింపులు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నలకు మార్కో రూబియో స్పందించారు.
ఈ చట్టంలోని కీలక నిబంధనల అమలును ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
రష్యాపై ఆంక్షల్లో భాగంగా ఇతర దేశాలపై సుంకాలు విధించే అంశంపై నిర్ణయం తీసుకునే ముందు దాని ప్రభావాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని రూబియో వివరించారు.
రష్యా నుంచి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే దిశగా భారత్ తన సరఫరా మార్గాలను విస్తరిస్తోందని (Diversifying) పేర్కొన్నారు.
వివరాలు
ఇతర దేశాల నుంచి సరఫరాకు మారడం సాధ్యం కాదు
అయితే, భారత్ వంటి పెద్ద దేశం రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను ఒక్కసారిగా పూర్తిగా నిలిపివేసి, ఇతర దేశాల నుంచి సరఫరాకు మారడం సాధ్యం కాదని రూబియో అభిప్రాయపడ్డారు.
భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, కీలక భాగస్వామి అని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఆంక్షలు, సుంకాలకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని రూబియో చెప్పారు.
ఇందుకోసం ఆయనకు 60 రోజుల సమయం అవసరమవుతుందని వివరించారు.
వివరాలు
సుంకాల నిర్ణయంపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
'లిండ్సే గ్రాహం చట్టం'లోని కొన్ని నిబంధనల అమలుకు మినహాయింపులు ఇవ్వడానికి గల కారణాలను కూడా మార్కో రూబియో వివరించారు.
అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలను అమెరికా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడి, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
వివరాలు
అవసరమైన సందర్భాల్లో మినహాయింపు
ఈ పరిస్థితులన్నీ ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, రష్యాపై ఆంక్షలు విధించేటప్పుడు వాటి విస్తృత ప్రభావాలను అంచనా వేయాల్సి ఉంటుందని వివరించారు.
లిండ్సే గ్రాహం చట్టాన్ని రూపొందించిన సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే పరిణామాలను అధ్యయనం చేసేందుకు, అవసరమైన సందర్భాల్లో మినహాయింపులు ఇచ్చే వెసులుబాటును కల్పించినట్లు రూబియో తెలిపారు.
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆంక్షలు, సుంకాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.