భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ 'గేట్స్ నోట్స్'లో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించగలదని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వేళ, భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతోందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కోగలదని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని వివరించారు. పోలియోను నిర్మూలించిందని, హెచ్‌ఐవీ వ్యాప్తిని, పేదరికాన్ని, శిశు మరణాలను తగ్గించిందన్నారు. పారిశుద్ధ్యం, ఆర్థిక సేవలకు విషయంలో కూడా ప్రగతి సాధించినట్లు చెప్పారు.
అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్: గేట్స్
భారత్ అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందన్నారు బిల్‌గేట్స్. ప్రాణాంతకమైన డయేరియాకు కారణమయ్యే వైరస్‌ను నిరోధించే రోటావైరస్ వ్యాక్సిన్ తయారు చేసి భారత్ ప్రతి బిడ్డకు అందిస్తోందని చెప్పారు. భారత నిపుణుల సాయంతో గేట్స్ ఫౌండేషన్ భారీగా ఈ వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు వివరించారు. 2021నాటికి, 83 శాతం 1 ఏళ్ల వయస్సు పిల్లలకు రోటావైరస్ టీకాలను అందించినట్లు చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా తక్కువ ధరకు లభ్యమయ్యే భారత్ తయారు చేసిన టీకాను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల్లో భారత ప్రభుత సంస్థలతో గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపినట్లు వెల్లడించారు. భారతదేశం తన ప్రజలకు ఆహారం అందించడానికి, వ్యవసాయానికి మద్దతును కొనసాగించడానికి ఉత్తమంగా సిద్ధంగా ఉందని చెప్పారు.