Page Loader
'మిల్లెట్స్‌తో ట్రై చేయండి',  వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్
వంట చేయడంలో 'బిల్‌గేట్స్'కు ప్రధాని మోదీ టిప్

'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్

వ్రాసిన వారు Stalin
Feb 04, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు. ప్రముఖ చెఫ్ ఐటాన్ బెర్నాథ్‌తో కలిసి గేట్స్ భారతీయ వంటకమైన గోధుమ రోటీని చేశారు. ఐటాన్ ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా ఈ వంటకం గురించి తెలుసుకున్నారు. శనివారం గేట్స్‌తో కలసి ఐటాన్ గోధుమ పిండితో రోటీలు చేశారు. అనంతరం ఇద్దరు రోటీలను రుచిచూశారు. ఈ వీడియోను గేట్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇది చూసిన మోదీ ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌చేసి, మిల్లెట్స్‌తో రోటీలను ట్రై చేయమని బిల్ గేట్స్‌కు సూచించారు.

ప్రధాని మోదీ

తృణ ధాన్యాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత

కేంద్ర ప్రభుత్వం తృణ ధాన్యాలపై ప్రత్యేక సారిస్తోంది. వీటి సాగుకు ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్టెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించేందుకు కూడా సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఎంపీలందరికీ మిల్లెట్ నేపథ్యంతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజనానికి ప్రధాని, ఆయన మంత్రివర్గంతో పాటు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో పార్లమెంటులో మధ్యాహ్న భోజన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.