10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు. ఒప్పందంలో భాగంగా, మైక్రోసాఫ్ట్ తన పరిశోధనలో OpenAIకి సహాయం చేయడానికి సూపర్ కంప్యూటర్‌ల అభివృద్ధిలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడుతుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) సేవలు, ప్రొడక్ట్స్, పరిశోధన ప్రయోజనాల కోసం OpenAIకు ఏకైక క్లౌడ్ భాగస్వామి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఈ ఒపందం కోసం $10 బిలియన్ల పెట్టుబడి పెడుతుంది.
పెట్టుబడిపై లాభాలు పొందేవరకు OpenAIలో 75% లాభాలు తీసుకోనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ తన పెట్టుబడిపై రాబడిని పొందే వరకు OpenAI లాభాలలో 75% పొందవచ్చని ఒప్పందంలో పేర్కొంది. కంపెనీలో 49% వాటాను కూడా కైవసం చేసుకుంటోంది. అత్యాధునిక AI పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి, AIని కొత్త సాంకేతిక వేదికగా ప్రజలకు చేరువ చేయడానికి OpenAIతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒప్పందం గురించి వివరించారు. Microsoft 2019లో OpenAIలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. తర్వాత ఇది GPT-3 AI టెక్నాలజీ కోసం ప్రత్యేకమైన లైసెన్స్‌ను కొనుగోలు చేసింది. వీరిద్దరూ Azure OpenAI సర్వీస్‌లో పని చేసారు, ఇప్పుడు ChatGPT త్వరలో రాబోతోంది. OpenAI తన ChatGPT Botకు శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ మౌలిక సదుపాయాలను కూడా ఉపయోగిస్తుంది.