గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు
మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అంచనా. వీరికి పరిహారంగా ఇవ్వడానికి €35 మిలియన్ల నుండి €45 మిలియన్ల వరకు ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో సహా ప్రధాన టెక్ కంపెనీలు సిబ్బందిని తగ్గించడం ప్రారంభించడం మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపిన అమెజాన్ ఉద్యోగాల కోత ఇప్పటివరకు అతిపెద్దది. ఇప్పుడు ఆ లిస్ట్ లో Spotify కూడా చేరింది. మాంద్యం వలన ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
నిర్వహణ ఖర్చుల భారం తగ్గించుకోవడం కోసమే ఈ ఉద్యోగాల కోత
2022లో, Spotify నిర్వహణ ఖర్చుల పెరుగుదల ఆదాయ వృద్ధి కంటే రెండింతలు పెరిగింది. Spotify మూడవ త్రైమాసిక నివేదికల ప్రకారం, కంపెనీలో దాదాపు 9,800 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థపై వడ్డీ రేట్లు పెరగడం, ఒత్తిడి కారణంగా మెటా, ట్విట్టర్, గూగుల్ కూడా తమ ప్రకటనల ఖర్చు తగ్గించడాన్ని కంపెనీ గమనించింది. అందుకే మరో మార్గం లేక ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత ఉద్యోగులు సుమారు ఐదు నెలల జీతాన్ని అందుకుంటారని, వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగుతుందని, ఈ ఉద్యోగులందరూ రెండు నెలల పాటు అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలకు అర్హులని సంస్థ పేర్కొంది.